అటవీ శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించిన జీలుగుల గ్రామ యువకుడు రోహిత్

0

అటవీ శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించిన జీలుగుల గ్రామ యువకుడు రావుల రోహిత్
– కవాల్ టైగర్ రిజర్వ్‌పై పరిశోధనతో గుర్తింపు
ఎల్కతుర్తి:
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జీలుగుల గ్రామానికి చెందిన రావుల రోహిత్ అటవీ శాస్త్రంలో (ఫారెస్ట్రీ) పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఈ ప్రతిష్ఠాత్మక విజయంతో ఆయన స్వగ్రామానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
ప్రకృతి వనరుల పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణపై ఆసక్తి కలిగిన రోహిత్, తన పరిశోధనను తెలంగాణలోని కవాల్ టైగర్ రిజర్వ్‌పై కేంద్రీకరించారు. డా. మిల్కూరి చిరంజీవ రెడ్డి మార్గదర్శకత్వంలో “కవాల్ టైగర్ రిజర్వ్‌లోని ఎకోసిస్టమ్ సేవల విలువ నిర్ధారణ” అనే అంశంపై సమగ్రంగా పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనలో అటవీ ప్రాంతాలు మనిషికి అందించే సేవలు-నీటి సరఫరా, కార్బన్ నిల్వ, మట్టి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలను ఆర్థిక పరంగా అంచనా వేసి విశ్లేషించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న వాతావరణ మార్పు, అటవీ వినాశనం, నీటి కొరత వంటి సమస్యల నేపథ్యంలో ఈ అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది. కవాల్ టైగర్ రిజర్వ్ వంటి జీవ వైవిధ్య సమృద్ధిగా ఉన్న అటవీ ప్రాంతాలు పర్యావరణ సమతుల్యతకు కీలకమని, ఇవి కార్బన్ నిల్వ ద్వారా వాతావరణ మార్పును నియంత్రించడమే కాకుండా భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, మట్టి ఎరోషన్ తగ్గింపులో ముఖ్యపాత్ర పోషిస్తాయని రోహిత్ తన పరిశోధనలో వెల్లడించారు. ఈ సేవలకు ఆర్థిక విలువను నిర్ధారించడం ద్వారా అటవీ సంరక్షణకు పెట్టుబడులు పెంచాల్సిన అవసరాన్ని స్పష్టంచేశారు. ఈ అధ్యయనం ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కూడా ఉపయోగపడే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని గణాంకాల రూపంలో అర్థం చేసుకునేందుకు ఇది దోహదపడుతుందని చెబుతున్నారు. రోహిత్ తండ్రి రావుల తిరుపతి సీనియర్ జర్నలిస్టుగా పేరుపొందగా, తల్లి వాసుమతి గృహిణి. గ్రామీణ నేపథ్యం నుంచి ఉన్నత విద్యలో రాణించి డాక్టరేట్ సాధించడం ఆయన కృషి, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. రోహిత్ సాధించిన ఈ విజయంపై గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయన, పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్రను కొనసాగించాలనే సంకల్పంతో ఉన్నారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ, “ప్రకృతి మనకు అందించే సేవలను మనం అర్థం చేసుకుని సంరక్షిస్తేనే భవిష్యత్ తరాలకు సురక్షితమైన ప్రపంచాన్ని అందించగలం” అని తెలిపారు. తన గురువు డా. మిల్కూరి చిరంజీవ రెడ్డి మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *