సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలి
సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలి
– హుజురాబాద్ ఎస్సై యూనస్ అహ్మద్
హుజురాబాద్:
సైబర్ నేరాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాలని హుజురాబాద్ ఎస్సై యూనస్ అహ్మద్ అలీ సూచించారు. గురువారం ఉదయం పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ లో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారని, పోలీసులు ప్రజల భద్రతకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యక్తిగత అప్రమత్తత చాలా అవసరమని తెలిపారు. లాటరీ లేదా పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్నారని చెప్పే నకిలీ ఆఫర్లను నమ్మవద్దని, ఇలాంటి వాటి వెనుక వ్యక్తిగత సమాచారం లేదా డబ్బు కాజేసే ఉద్దేశమే ఉంటుందన్నారు. మేము సీబీఐ లేదా పోలీసులము మాట్లాడుతున్నామని చెప్పే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల డీపీ పెట్టుకుని వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మీ కుమారుడు నేరం చేశాడు, డబ్బు పంపిస్తే కేసు మాఫీ చేస్తాం అని పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ ను అస్సలు నమ్మవద్దన్నారు. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఇలా డబ్బు డిమాండ్ చేయవన్నారు. సైబర్ నేరాలను నివారించడానికి పలు కీలక సూచనలను పాటించాల్సిన అవసరం ఉందని ఎస్సై యూనస్ అలీ తెలిపారు. అపరిచితులు లేదా అనుమానాస్పద కాల్స్, సందేశాలకు మీ బ్యాంకు వివరాలు, వ్యక్తిగత వివరాలు తెలియజేయవద్దన్నారు. ఫోన్లో ఓటీపీ, అలాగే ఓఎల్ఎక్స్, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, ఈ-కేవైసీ అప్డేట్ వివరాలు అడిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పవద్దన్నారు. ఏదైనా లావాదేవీలు లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు అధికారిక వెబ్సైట్ల ద్వారానే చేయాలని, ఆర్బీఐ, సెబీ వంటి వాటిలో రిజిస్టర్ అయిన కంపెనీల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలన్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, బలమైన పాస్వర్డ్ ను తరచుగా మార్చాలన్నారు. నేరం జరిగిన గంటలోపు 1930 అనే టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
