వినియోగదారు చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

0

వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలి
. జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్త

హనుమకొండ:
వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. శనివారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ…దేశంలోని ప్రతి వినియోగదారు వినియోగదారుల చట్టం పై అవగాహన కలిగి ఉండాలన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం ప్రతి ఒక్కరూ తమ హక్కులను తెలుసుకోవాలన్నారు. వినియోగదారులకు సంబంధించిన ప్రతి విషయం పై అవగాహన పెంచేందుకు జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. వినియోగదారులు ఏ వస్తువు నైనా కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రశీదు అడిగి తీసుకోవాలన్నారు. జీఎస్టీ ఛార్జీల పేరుతో అదనంగా చెల్లించాలని ఎవరైనా అడిగినట్లయితే వారిపై జిల్లా అధికారులకి తెలియజేయాలన్నారు. వినియోగదారులను ఇబ్బందులు పెడితే చర్యలు చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ముఖ్యంగా డిజిటల్ వినియోగం, డిజిటల్ చెల్లింపుల విషయంలో తమ ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు, ఓటీపిలు వేరే వాళ్ళకి చెప్పే ముందు చాలా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు. కేవలం విశ్వసనీయత కలిగిన ఈ-కామర్స్ ప్లాట్ ఫాం నుండి మాత్రమే కొనుగోలు చేయాలని కోరారు. ఆన్లైన్ వ్యవస్థ లో ప్రతి వస్తువు తక్కువగా రావడం, కొనుగొలుదారులు ఆకర్షితులై వస్తువులు కొనుగోలు చేయడం సహజం అని, వాటిని కేవలం ఓపెన్ బాక్సు – క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా మాత్రమే తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మహేందర్ జీ మాట్లాడుతూ.. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ తో చర్చించిన అనంతరం కన్జ్యూమర్ సెల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మండల, గ్రామపంచాయతీ స్థాయిలో నిర్వహించే సమావేశాల్లో ముందుగా వినియోగదారుల సమస్యలు వాటి పరిష్కారాలు చర్చించాలని కోరారు.

ఈ సందర్భంగా ఈ- కామర్స్, డిజిటల్ వర్తకశకంలో వినియోగదారుల రక్షణ అనే అంశం గురించి జిల్లా పౌరసరఫరాల అధికారి పి. వసంత లక్ష్మి వివరించారు. అనంతరం ఈ- కామర్స్, డిజిటల్ వర్తకశకంలో వినియోగదారుల రక్షణకు సంబంధించిన కరపత్రాలను ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, మహేందర్ జీ, తదితరులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డివో శ్రీనివాస్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ ఎం.హరిప్రసాద్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మహేందర్, తహసిల్దార్ డీఎవో విజయలక్ష్మి, డిప్యూటీ తహసిల్దార్లు రమేష్, కృష్ణ, సత్యనారాయణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేణు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ ఎండి.ఆజాద్ అహ్మద్, జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షులు రతన్ సింగ్ ఠాకూర్, వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *