ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యం
ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యం
దసరా రోజున వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభం
డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు
వరంగల్:
ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ పాత సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, ఈ నెల 20న దసరా పండుగ సందర్భంగా ప్రయోగాత్మకంగా ఓపీ సేవలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సహచర మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీలు వేం. నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఎల్. నాగరాజు, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణితో కలిసి ఆసుపత్రి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు, రహదారులు-భవనాల శాఖ అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వైద్య విభాగాలు, రోగులకు కల్పించనున్న సదుపాయాలు, చికిత్సకు అవసరమైన మౌలిక వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. గత ప్రభుత్వం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిన ఈ ఆసుపత్రిని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అవసరమైన నిధులు కేటాయించిందని మంత్రి తెలిపారు. నిరంతర పర్యవేక్షణతో పనులను వేగవంతం చేయడంతో నిర్మాణం తుది దశకు చేరుకుందని పేర్కొన్నారు. చిన్నచిన్న పనులు మినహా ఆసుపత్రి వైద్య సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ నెల 17న మరోసారి నిర్మాణ పనులను పరిశీలించి, ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి ఆసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన మంత్రి, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే పెద్ద సంఖ్యలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వరంగల్ నగరంతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించే దిశగా ఈ ఆసుపత్రి కీలకంగా నిలుస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.

