పిల్లలను ఫోన్ కు దూరంగా ఉంచాలి

0

పిల్లలను ఫోన్ కు దూరంగా ఉంచాలి
– డాక్టర్ బండి శృతి
– నషా ముక్త్ భారత్ పోస్టర్ ఆవిష్కరణ
హుజురాబాద్:
ప్రస్తుత సమాజంలో జీవితంలో ఫోన్ ఒక భాగమైందని కానీ ఫోను ఎంత వాడాలో అంతవరకే పరిమితం చేసుకోవాలని పసిపిల్లలను దూరంగా ఉంచాలని స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ బండి శృతి సూచించారు. బ్రహ్మకుమారిస్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం హుజరాబాద్ పట్టణంలోని బ్రహ్మకుమారి సెంటర్లో నషా ముక్త్ భారత్ అభియాన్ అనే పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శృతి మాట్లాడుతూ.. నేటి సమాజంలో పసిపిల్లలు చాలావరకు ఫోనుకు ఆకర్షితులు అవుతున్నారని దీనిని తల్లిదండ్రులు కట్టడి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. పసిపిల్లలు ఫోన్ చూడటం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందని, వారిలో సృజనాత్మకత లోపిస్తుందని తెలిపారు. గర్భిణీ స్త్రీలు కూడా సాధ్యమైనంత వరకు ఫోనుకు దూరంగా ఉండాలన్నారు. మంచి పుస్తకాలు చదవడంతో పాటు సంగీతం వింటే పుట్టబోయే బిడ్డలు జ్ఞానంతో జన్మిస్తారని అన్నారు. భారతదేశం ఒక జ్ఞాన సంపన్నమైన దేశం అని ఈ ఫోన్ వాడటం వల్ల అలాంటి జీన్స్ నశించే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరు అవసరమైతే తప్ప ఫోన్కు దూరంగా ఉండాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే ఆరోగ్యకరంగా ఉంటామన్నారు. సెంటర్ ఇన్చార్జ్ బికే శ్రీవాణి మాట్లాడుతూ.. బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో దేశంలో 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం, సామరస్య కుటుంబం, ఉజ్వల భవిష్యత్తు, అభివృద్ధి చెందిన దేశం కోసం ప్రతి ఒక్కరూ వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయాలని కోరారు. యోగ జీవన విధానాన్ని అవలంబించి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని సూచించారు. మాదకద్రవ్య రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతతో ముందుకు సాగాలన్నారు. అనంతరం సెంటర్ కు వచ్చిన ప్రతి ఒక్కరిచే వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా మండలంలోని కందుగుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల, వివేకవర్ధిని పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గుంటి రాజయ్య శివరాత్రి, ఈశ్వరయ్య, నర్సింగం చౌదరి, జ్యోతి రాణి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *