పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మార్పు చెందాలి

0

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మార్పు చెందాలి
– ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి
భద్రాద్రి, వరంగల్ సీసీయఫ్, డి భీమా నాయక్
హన్మకొండ:
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు వారి ప్రవర్తనలో మార్పు తెచ్చుకోని, ప్రకృతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భద్రాద్రి వరంగల్ సి సి ఎఫ్ ఈ భీమా నాయక్ సూచించారు. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ (ఔల్స్), హన్మకొండ అటవీశాఖ లు సంయుక్తంగా గురువారం పట్టణంలోని కాకతీయ జూ పార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరుతూ పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హనుమకొండ జిల్లా అటవీ శాఖాధికారి అనూజ్ అగర్వాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి సైకిల్ ర్యాలీ ని ప్రారంభించారు. సైకిల్ ర్యాలీ కార్యక్రమం ట్రైసిటీ రైడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఏజే పెడల్స్ అధినేత జయంత్, శ్రేయాన్, నిఖిల్ సంయుక్తంగా నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భీమా నాయక్ మాట్లాడారు. ప్రకృతి నుండి లభించే వనరులతో జీవితాన్ని సుఖమయం చేసుకునే మనం ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనని అన్నారు. ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయరాదన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పర్యావరణ కాలుష్యం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుని సుస్థిర అభివృద్ధి సాధించే ప్రయత్నం చేయాలన్నారు. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాతావరణంలో ఊహించని మార్పులు వస్తున్నాయన్నారు. విపరీతమైన వర్షాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలకు పర్యావరణ కాలుష్యమే కారణమని పేర్కొన్నారు. అడవుల విస్తీర్ణం తగ్గిపోకుండా కాపాడుకోవాలన్నారు. అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే అవసరమని అన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం..
– వరంగల్, హన్మకొండ, జనగాం డి.ఎఫ్.ఓ. అనుజ్ అగర్వాల్
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని వరంగల్ హనుమకొండ జనగాం డి.ఎఫ్.ఓ అనూజ్ అగర్వాల్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. పర్యావరణ పరిరపక్షణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విధి విధానాలను ప్రతి ఒక్క రూ తప్పక పాటించాలన్నారు. ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ వాడకం నిషేధించుకోవాలని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్లాస్టిక్‌ వాడకం నిత్య జీవితంలో ఒక భాగమైందని, ఏ ఇంట్లో చూసినా ఇవి ఎక్కువగా కనబడుతున్నాయన్నారు. రీ సైక్లింగ్‌కు ఉపయోగపడని ప్లాస్టిక్‌ సంచులు అతిగా వాడి ఎక్కువగా పడేస్తున్నారన్నారు. దీంతో భవిష్యత్తులో చాలా ప్రమాదం సంభవిస్తుందని పర్యావరణ హితులు హెచ్చరిస్తున్నారన్నారు. ఏటా భారీ సంఖ్యలో పక్షులు, జీవులు ఈ ప్లాస్టిక్‌ బారిన పడి నశిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్లాస్టిక్ అంతం-ప్రపంచ పంతం కావాలి
– ఔల్స్, సంయుక్త కార్యదర్శి పిట్టల రవిబాబు
ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ముందుగా ప్లాస్టిక్ అంతం ప్రపంచ పంతం కావాలని ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త కార్యదర్శి పిట్టల రవిబాబు సూచించారు. పర్యావరణాన్ని రక్షించడంలో ప్రతి ఒక్కరు భాద్యతగా భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 51 ఏ/(జి) ప్రకారంగా ప్రతి భారత పౌరుని యొక్క ప్రాథమిక విధిగా మనచుట్టు ఉన్న పర్యావరణంలోని అడవులు, నదులు, సరస్సులు, భూమి, మట్టి, ఇసుక గాలి, నీరును కాలుస్య కోరలనుండి రక్షించుకుంటూ మూగ జీవాలైన జంతువుల పట్ల భూత దయ కల్గి ఉండాలన్నారు. సహజ వనరులను రక్షించాలని కోరారు. అదే విధంగా ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని “ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లి“ అనే అంశాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు భాద్యతగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేదించి, మాంసాన్ని గాని, చేపలను గాని, చికెన్ తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ సంచులకు బదులు స్టీల్ బాక్స్ లను ఉపయోగించాలని, బజారుకు వెళ్ళినపుడు చేతి సంచులను, జూట్ బ్యాగ్ లను తీసుకెళ్ళాలని కోరారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు పాటిస్తేనే ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ అంతమవుతుందని, సుస్తిర పర్యావరణాన్ని రాబోయే తరాలకు ఇవ్వగలమని గుర్తుచేశారు. ఈ సందర్బంగా అటవీ, వన్యప్రణుల, పక్షుల ఛాయా ఛిత్రాలను పర్యావరణ విద్య ప్రదర్శన కొరకు ఆవిష్కరించి విద్యార్థులతో పాటు తిలకించారు.

ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దుకోవాలి
– జూ పార్క్ రేంజ్ అధికారి బి మయూరి
ప్రకృతి పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ముందుగా ప్లాస్టిక్ రైటర్ సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలని జూపార్క్ రేంజ్ అధికారి బి మయూరి అన్నారు. ఈ సవంత్సరం జూపార్క్ ను ప్లాస్టిక్ రహిత జూ గా మార్చుతున్నామన్నారు. అదే విధంగా జూపార్క్ కు ఒక తెల్ల పులి, సింహాలను తెచ్చే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. జూ పార్కు అభివృద్ది కొరకు రూ. 5 కోట్ల నిధులు కేటాయించినందుకు పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సాంకేతికంగా సహకరించిన ఔల్స్ అధ్యక్షులు ఇందారం నాగేశ్వర్ రావు, వన సేవ సమితి కార్యదర్శి జి నరేష్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థులకు బహుమతులు అందజేత…
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 4న జూ పార్కు లో విద్యార్థిని, విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అతిథులను ఔల్స్ యన్.జి.ఓ. అటవీ ఛాయాచిత్ర మోమెంటోలతో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో మట్టేవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, వరంగల్, తేజస్వి హై స్కూల్, హనుమకొండ, డాఫడిల్స్ హై స్కూల్, హనుమకొండ, ప్లాటినం జూబ్లీ హై స్కూల్, హనుమకొండ నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాద్యాయులు, అటవీ శాఖ సిబ్బంది, జూ పార్కు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *