పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు…

0

పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు…
. జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్
హన్మకొండ:
పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలని కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్ అన్నారు. శనివారం కాకతీయ విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ… నాలుగో స్తంభంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రచార, ప్రసారమాధ్యమాలపై ఉందని, ప్రజాస్వామ్య దేశాల్లో మీడియా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రచార, ప్రసార మాధ్యమాలపై ప్రజల్లోనూ ఎన్నో ఆశలు, అంచనాలు ఉంటాయన్నారు. చాలా విషయాలను తమకు అర్థమయ్యే రీతిలో పత్రికలు వివరిస్తాయనే ప్రజలు భావిస్తారని అందుకు అనుగుణంగా సమాజంలో మార్పులు తీసుకువచ్చేందుకు పత్రికలు కీలక భూమిక పోషించాలని ఆయన సూచించారు. పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేమని, మనిషి జీవిత విధానాన్ని, ఆలోచన క్రమాన్ని సరైన మార్గంలో పెట్టగల శక్తి పత్రికలకు ఉందన్నారు. సమాజానికి దిశా నిర్దేశం చేయడంలో పత్రికలు అద్వితీయమన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రజల పక్షాన నిలబడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయన్నారు. సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలపై రాస్తున్న కథనాలు జీర్ణించుకోలేని పాలకులు భౌతిక దాడికి దిగడం ముమ్మాటికి అది సమాజం పై దాడే అన్నారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్సు మేరకు 1966 నవంబర్ 16న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16న జాతీయ పత్రిక దినోత్సవం నిర్వహించుకుంటున్నామన్నారు. పత్రికలు నిజాన్ని నిర్భయంగా, స్వేచ్ఛగా, రాజకీయాలకు అతీతంగా వార్తలు ప్రచురించాలన్నారు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న జర్నలిస్ట్ లపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. అనేకమంది జర్నలిస్టులపై రోజు రోజుకు ఏదో ఒక చోట దాడులు జరుగుతునే వున్నాయన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రజలు కోరుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నో కష్టాలకోర్చి అనేక వాస్తవిక స్థితిగతుల సమాచారాన్ని ప్రజలకు చేరవేసే జర్నలిస్టులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందన్నారు. కానీ అదేస్థాయిలో వారు విధి నిర్వహణలో భాగంగా ఎన్నో ఒత్తిళ్లను తట్టుకోవాల్సి వస్తుందన్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిజ నిజాలను నిగ్గు తేల్చి ప్రజల ముందుంచుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిజం విభాగం అధ్యాపకులు డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, కంజర్ల నర్సింహా రాములు, డాక్టర్ వంగాల సుధాకర్, డాక్టర్ మోటె చిరంజీవి, ఈర్ల సురేందర్, జర్నలిజం విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *