హుస్నాబాద్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా..

1

హుస్నాబాద్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా..
. విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం
. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కృషి..
. గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు..
. హుస్నాబాద్ ను పర్యాటక కేంద్రంగా తయారు చేస్తాం..
. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు శక్తివంచన లేకుందా కృషి చేయాలి
. ప్రభుత్వ భూముల ల్యాండ్ బ్యాంకు రూపొందించాలి..
. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం
హుస్నాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డివో కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు మిక్కిలినేని మనుచౌదరి, పమేలా సత్పతి, ప్రావీణ్యతో పాటు అదనపు కలెక్టర్లు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మిషన్ భగీరథ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి పంచాయత్ రాజ్, గిరిజన సంక్షేమం, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయం, విద్యుత్తు, డిఆర్డిఏ తో పాటు పలు శాఖలపై మంత్రి సుదీర్ఘంగా ఐదు గంటల పాటు చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… సర్పంచులు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పిటిసిల పదవీకాలం పూర్తయినందున అధికారులే ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా శక్తివంచన లేకుండా పనిచేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న చేనేత, వ్యవసాయ ఆధారిత రంగాలతో పాటు పలు పథకాలను రైతులు పేద వర్గాలకు అందేలా చొరవ చూపాలని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో రోడ్ల పరిస్థితి తాగునీటి వ్యవస్థ, ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థితిగతులపై అధికారులంతా ఒక రూట్ మ్యాప్ తయారుచేయాలని ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కుటీర పరిశ్రమల కల్పనకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. హుస్నాబాద్ తో పాటు చుట్టూ ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా అధికారులు పకడ్బందీగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అధికారులు రూపొందించాలని, ఇందుకు నిధులు మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఆన్ గోయింగ్ వర్క్స్ కు సంబంధించిన పనులు వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. గౌరవెల్లి, దేవాదుల, ఎస్సారెస్పీ మిడ్ మానేర్ ప్రాజెక్టుల ద్వారా హుస్నాబాద్ రైతాంగానికి సాగునీరు అందేలా ప్రత్యేక కృషి చేస్తానని చెప్పారు. సాగునీటికి రైతులు ఇబ్బందులు పడకుండా చూస్తానని తెలిపారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం వ్యవసాయం, పాడిపంట, వ్యవసాయ ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఇక్కడ పాల ఉత్పత్తి అధికంగా జరుగుతున్నదని, పశుసంపద పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు, నిరుద్యోగులు యువత స్వయం ఉపాధికి చేపలు, గొర్లు, మేకల పెంపకంతో పాటు డైరీ ఫామ్స్ ఏర్పాటుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. హుస్నాబాద్ నుంచి చేపలు మేకలు, గొర్లు హైదరాబాద్ కు ఎగుమతి చేసేలా ప్రత్యేక దృష్టి సారిస్తానని మంత్రి పేర్కొన్నారు.
పర్యాటక ప్రాంతంగా హుస్నాబాద్…
హుస్నాబాద్ ప్రాంతం టూరిజం స్పాట్ కు అనుకూలంగా ఉందని తెలిపారు. ఈ మేరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ దేవాలయం, శనిగరం ప్రాజెక్టు, మహాసముద్రం, రాయికల్ జలపాతం సర్వాయిపేట, పీవీ నరసింహారావు స్వగ్రామం వంగర, కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయం పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హుస్నాబాద్ ను పర్యటకంగా అభివృద్ధి చేస్తే మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాలను అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అద్దె భవనాల్లో కాకుండా సొంత భవనాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటానని, కలెక్టర్లు ఈ విషయంలో చొరవ చూపాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చెరువుల్లో పెద్ద ఎత్తున చేపల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. రోడ్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్ అధికారులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. స్వశక్తి సంఘాల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటానని, నియోజక వర్గంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టుల పూర్తికి చర్యలు…
విద్యుత్ సరఫరా లో ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. గౌరవెల్లి, దేవాదుల ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన మేరకు ఆయకట్టుకు సాగునీరు అందించేలా సత్వరమే అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు వైద్య పరంగా సహాయం అందించేందుకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇందుకు తగిన సిబ్బందిని ఏర్పాటు చేశానని చెప్పారు. అధికంగా కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ కి వెళ్తున్నారని, దీనిపై ప్రభుత్వం ఒక సర్వే నిర్వహిస్తున్నదని దానికి పరిష్కారం మార్గం కనుక్కుంటామని తెలిపారు. విదేశీ విద్యా విధానంలో భాగంగా విదేశాలకు వెళ్లే యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లు మిక్కిలినేని మను చౌదరి, పమేలా సత్పతి, ప్రావీణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, ప్రఫుల్ దేశాయ్, రాధిక గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మి కిరణ్ వెంకట్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి, డివిజనల్ స్థాయి, నియోజకవర్గంలోని మండలాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు
. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు కేంద్రాలను పర్యటకంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంతోపాటు వివిధ ప్రాంతాలను పర్యటకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అలాగే గౌరవెల్లి దేవాదుల ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి సాగునీటి అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖల ద్వారా పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి సూచనలు మేరకు నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు.

ల్యాండ్ బ్యాంకింగ్ ఏర్పాటు చేస్తాం..
.కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
చిగురుమామిడి సైదాపూర్ మండలాల్లో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సర్వాయిపేట, రాయికల్ జలపాతం టూరిజం స్పాట్ గా మార్చేందుకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేస్తామని తెలిపారు. రైతు వేదికల ద్వారా రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు శివశక్తి మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి
ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు పెండింగ్ పనులను సత్వరమే పూర్తయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించిన రూట్ మ్యాప్ ను తయారు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల వివరాలతో ల్యాండ్ బ్యాంకు తయారుచేసి భూములు కబ్జా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో చర్చించిన అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *