గెలిచేదేవరో…

గెలిచేదేవరో…
• ఎవరి లెక్కలు వారివే..
• తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
• గెలుపోటములపై సర్వత్రా చర్చ… టెన్షన్

కరీంనగర్:
తెలంగాణ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ నేడు జరగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో గెలుపు ఎవరికి వరిస్తుందోనని సర్వత్ర చర్చ జరుగుతున్నది. గెలుపు పై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. పోలింగ్ అయిన ఓటింగ్ ను సామాజిక వర్గాల వారిగా విభజించి సరళి చేస్తూ గెలుపోటములపై అంచనాలు వేసుకుంటున్నారు. ఎవరికి వారే లెక్కలు వేసుకుంటూ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రత్యర్థి పార్టీలకు దీటుగా పని చేశామని ఓటర్లు అందరూ తమకే ఓటు వేశారని గెలుపు కచ్చితంగా వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో రచించిన వ్యూహాలు, ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు తమకు అనుకూలంగా మారుతాయనే అంచనాల్లో ఉన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ తొలత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం రౌండ్ల వారిగా ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
ఎవరి ధీమా వారిదే…
ప్రధానంగా అధికార బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తప్పక ఓటు వేసి ఉంటారని ధీమాలో ఉన్నారు. ఆ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రధానంగా ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా, ఆయా సామాజిక వర్గాలకు వ్యక్తిగత క్తిగత సబ్సిడీ రుణాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ, కేసీఆర్ కిట్టు, మిషన్ భగీరథ నీళ్లు, తదితరుల పథకాల తో పాటు ఆయా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు పల్లె ప్రగతి వైకుంఠధామాలు, రైతు వేదికల తో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో సంక్షేమ పథకాలు తమకు కలిసివస్తాయని ధీమాలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత, అమలుకాని సంక్షేమ పథకాలు, ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగ సమస్య, ఉద్యోగుల సమస్యలు తమకు ఓట్లుగా మారాయని, దీనికితోడు తాము మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు సంక్షేమ పథకాలు ప్రజలు నమ్మి ఓట్లు వేశారని అవే తమకు గెలిపించి అధికారంలోకి తీసుకువస్తాయనే నమ్మకంతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, బిఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారిందని, దీనికి తోడు కేంద్ర పథకాలు తమను గెలిపిస్తాయి అని నమ్మకంతో బిజెపి అభ్యర్థులు ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమ కలిసి వస్తుందని జిల్లాలో ఆశించిన ఫలితాలు సాధిస్తామని సంకల్పంతో బీజేపీ నాయకులు ఉన్నారు.