ఓడినా, గెలిచినా ప్రజల్లోనే ఉంటా : ఎంపీ బండి సంజయ్

కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషం..
. కాంగ్రెస్, రేవంత్ రెడ్డిలకు అభినందనలు
. నన్ను ఓడగొట్టేదాకా మా పార్టీ వాళ్లే వెంటపడ్డారు
. ఓడినా, గెలిచినా ప్రజల్లోనే ఉంటా…
. బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం
. కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ నా హ్యాట్సాఫ్…
. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

కరీంనగర్:
కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి బీజేపీ పోరాడితే… చివరకు కాంగ్రెస్ లాభపడిందన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కరీంనగర్ విషయానికొస్తే… ప్రతిసారి తన ఓట్ల శాతం పెరుగుతోందన్నారు. తనను ఓడించాలనే లక్ష్యంతో ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లకు, ఆస్తులను కబ్జా చేసినోళ్ల పక్షానే ముస్లింలు ఓటేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆదివారం సాయంత్రం ఫలితాలు వెలువడిన అనంతరం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల గోస పడుతున్న ప్రజలను చైతన్యం చేసేందుకు పోరాడింది బీజేపి పార్టీ అని లాభపడింది మాత్రం కాంగ్రెస్ అన్నారు. ప్రజలను రాచిరంపాన పెట్టిన కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడితే నాతోపాటు ఎంతోమంది కార్యకర్తలపై కేసులు పెట్టారన్నారు. దాడులు చేశారని, జైలుకు పంపారని,ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. కేటీఆర్ అధికారంలో ఉన్నన్నాళ్లు మీడియాకు విలువ ఇవ్వలేదన్నారు. అహంకారంతో విర్రవీగి ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఎక్కడ లేని గౌరవం ఇస్తుండన్నారు. కరీంనగర్ విషయానికొచ్చే సరికి ప్రతిసారి నా మెజారిటీ పెరుగుతూ వస్తోందన్నారు. నేను ఫిర్యాదు చేసే వరకు 43, 289 పోలింగ్ బూత్ లలో ఓట్లు లెక్కించనేలేదన్నారు. అట్లాగే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫస్ట్ అయినా చేయాలి.. లేదా? చివర్లో అయినా చెప్పాలి. కానీ విచిత్రంగా మధ్యలో ఎట్లా లెక్కిస్తారని ప్రశ్నించారు. బండి సంజయ్ గెలుపోటముల ఆధారంగా పనిచేయడని.. గెలిచినా, ఓడినా పనిచేస్తా… నా లక్ష్యం బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, మెజారిటీ సీట్లు సాధించిన రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కేసీఆర్ కు నేను, రేవంత్ రెడ్డి మాత్రమే టార్గెట్ అని, మా ఇద్దరిని ఎట్లా ఇబ్బంది పెట్టారో తెలుసు.. ఏదైమైనా విజయం సాధించిన కాంగ్రెస్ కు నా శుభాకాంక్షలు తెలిపారు. నా కోసం, బీజేపీ కోసం నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు కష్టపడి పని చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు.