చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం..

0

చివరి ఆయకట్టు వరకు నీరందించాలి
. ఆరుతడి పంటలకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలి
. నకలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరిస్తాం..
. రైతులంటేనే కాంగ్రెస్ – కాంగ్రెస్ అంటేనే రైతులు
. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్:
వ్యవసాయానికి చివరి ఆయా కట్టు వరకు సాగునీరు అందిస్తామని, రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం యాసంగి 2023-24 కొరకు ప్రొఫెసర్ జి వి సుధాకర్ రావు లోయర్ మానేరు డ్యామ్ నుండి ప్రధాన కాలువ (దిగువ మానేరు) ద్వారా నీటిని మంత్రి జిల్లా కలెక్టర్, మానకొండూరు ఎమ్మెల్యే తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రైతులంటేనే కాంగ్రెస్ అని కాంగ్రెస్ అంటేనే రైతులన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఎల్ఎండి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు అని ప్రస్తుతం రిజర్వాయర్ లో నీటి నిల్వ19.646 ఉందన్నారు. మిడ్ మానేర్ 22 టీఎంసీల నీటి సామర్థ్యం అని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వ్యవసాయ రంగానికి, ఆరుతడి పంటలకు నిరాటంకంగా నీటిని అందించడం జరుగుతుందన్నారు. ఎస్ఆర్ఎస్పి 346 కిలోమీటర్ల వరకు 3.98 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.

వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలి…
రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని వాణిజ్య పంటలు, ఆరుతడి పంటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజా పాలన, అభయహస్తం ఆరు గ్యారెంటీ ల దరఖాస్తులలో రేషన్ కార్డు లేనివారి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎక్కడ కూడా దరఖాస్తులను తిరస్కరించరని, ఏ సమస్య ఉన్న దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆరు గ్యారెంటీ లలో ఒకటైన మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లోనే అమలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 6 కోట్ల మందికి పైబడి మహిళలు బస్సులలో 0 టికెట్ పై ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. నూతనంగా 1050 బస్సులను విడతల వారీగా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. జంట నగరాల కోసం 500, జిల్లాల కోసం 500 బస్సులను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రద్దీని నియంత్రించడానికి అదనంగా బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, మెరుగైన పాలన అందించడం కోసం సలహాలు, సూచనలు ఇచ్చిన స్వీకరిస్తుందన్నారు. ప్రగతి భవన్ ను ప్రజా భవనంగా మార్చడం జరిగిందన్నారు. నూతన సంవత్సరంలో అన్ని శుభ పరిణామాలు జరుగుతాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఈఎంసి శంకర్, ఎస్. ఈ. శివకుమార్, ఈఈ నాగభూషణం, ఆర్డివో మహేశ్వర్, తహసిల్దార్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *