ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగకరం :కలెక్టర్ పమేలా సత్పతి

మహిళా సాధికారత దిశగా ఉచిత బస్సు ప్రయాణం..
. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణాన్ని, ఆరోగ్య శ్రీ ప‌రిమితిని రూ. 10 ల‌క్ష‌లకు పెంచే కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్
. హెవి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన థర్డ్ జండర్లకు ఆర్టీసి డ్రైవర్లుగా నియామకం చేస్తాం..
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్:
మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు, మహిళా సాధికారతను సాధించే దిశగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం కల్పించిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కోన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మహాలక్ష్మి పథకం ద్వారా టిఎస్ ఆర్టీసి లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని మరియు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచే కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. కార్యక్రమంలో మొదటగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయం 10 లక్షల పోస్టర్ ను అధికారులతో కలిసి ఆవిష్కరించి అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని బస్సు ముందు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఫోటో గుర్తింపు కార్డు ఆధారంగా జీరో చార్జీ టికెట్‌ అందించడం జరుగుతుందని, ఇది మహిళా సాధికారతకు దోహదపడడంతో పాటు ఆర్టీసి బస్సులో ప్రయాణం వల్ల మహిళలకు రక్షణ ఉంటుందన్నారు. ప్రతి మహిళా ఆర్టీసి బస్సులో ప్రయాణించాలని సూచించారు. అనంతరం బస్సులో పిల్లలు, మహిళలు, థర్డ్ జండర్ లతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి నుండి కోర్ట్ చౌరస్తా, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, గీతాభవన్ మీదుగా బస్ స్టాండ్ వరకు కలెక్టర్ ప్రయాణం చేశారు. ప్రయాణ సమయంలో కలెక్టర్ తో పాటు ప్రయాణిస్తున్న మహిళా ఉద్యోగులు మరియు విద్యార్థులకు, థర్డ్ జండర్లకు జీరో చార్టీ టికెట్ ను అందించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి థర్డ్ జండర్ ఆర్టీసి డ్రైవర్ ను కరీంనగర్ జిల్లాలో నియమించే దిశగా, ఇప్పటికే హెవి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన థర్డ్ జండర్ లను ఆర్టీసి డ్రైవర్లుగా నియమిస్తామని, ఆర్టీసీ డ్రైవింగ్ వృత్తిపై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ కూడా ఇప్పిస్తామని, అందుకు అయ్యే ఖర్చును కూడా భరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఎసిపి మాదవి, జిల్లా వైద్యాధికారి కె.లలితాదేవి, డిడబ్ల్యుఓ సరస్వతి, డిసిహెచ్ఎస్ డాక్టర్ కృష్ణప్రసాద్, ఆర్టీసి 1డిపో డియం ఎల్. మల్లేషం, డిపో2 డియం వి. మల్లయ్య వైద్యులు, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రజనీ కృష్ణ, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.