రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా పై నిఘా పెంచాలి

0

కస్టమ్ మిల్లింగ్ వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి
. రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కరీంనగర్:
రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లింగ్ జరిపి నిర్దిష్ట మేరకు ఎఫ్.సి.ఐ కి బియ్యం నిల్వలు చేరవేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. శనివారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహన్ తో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సీ.ఎం.ఆర్ లక్ష్య సాధనపై సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాల వారీగా పెండింగ్ లో ఉన్న మిల్లింగ్ కోటా నిల్వలను ప్రస్తావిస్తూ, ఈ నెల 31తో ఎఫ్.సి.ఐ కి బియ్యం నిల్వలు చేరవేయాల్సిన గడువు పూర్తవుతోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా మిల్లింగ్ ను పూర్తి చేయించి బియ్యం నిల్వలు భారత ఆహార సంస్థకు చేరవేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఉప్పుడు బియ్యం నిల్వలు కోటాకు అనుగుణంగా అందించేలా చొరవ చూపాలన్నారు. ప్రతి రైస్ మిల్లులోనూ పూర్తి సామర్ధ్యానికి అనుగుణంగా మిల్లింగ్ జరిపేలా చర్యలు తీసుకోవాలని, కోటాకు అనుగుణంగా మిల్లింగ్ చేసిన బియ్యం నిల్వలు భారత ఆహార సంస్థ గోడౌన్లకు చేరేలా అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా పీ.డీ.ఎస్ బియ్యం రీసైక్లింగ్ దందాను నిరోధించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద కుటుంబాలకు అందించే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఉంచాలని, అక్రమార్కులను గుర్తించి కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్, పౌరసరఫరాల శాఖ అధికారి రజినికాంత్, డీయం సివిల్ సప్లై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *