గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి

0

పేద ప్రజల సంక్షేమం కోసం పరితపించిన గొప్ప నాయకుడు వాజ్‌పేయి
. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
. వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని ఘన నివాళి అర్పించిన సంజయ్

కరీంనగర్:
పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించిన గొప్ప నాయకుడు మాజీ ప్రధాని వాజ్‌పేయి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో ‘‘సుపరిపాలన దినోత్సవం’’ నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్ పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాజ్ పేయి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పదవుల కోసం ఎంతటికైనా దిగజారే వ్యక్తులు, పార్టీలున్న ఈరోజుల్లో నమ్మిన సిద్దాంతం కోసం, విలువల కోసం ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవులనే త్రుణ ప్రాయంగా వదిలేసుకున్న మహా నాయకుడు వాజ్ పేయి అన్నారు. ప్రజాస్వామ్య ఫలాలను అట్టడుగునున్న పేద వారికి తీసుకెళ్లాలనే శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను, సిద్ధాంతాలతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తప్పకుండా అమలు చేసిన గొప్ప నాయకుడన్నారు. జన సంఘ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న క్రమంలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశమంతా జరిగిన కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా జనతా పార్టీ అలయన్స్ ప్రభుత్వ ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించాడన్నారు. 2 ఎంపీ సీట్లకే పరిమితమైన బీజేపీని ఆ తరువాత ప్రభుత్వంలోకి తీసుకొచ్చేందుకు అలుపెరగని పోరాటం చేసి మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టి అవినీతి మచ్చలేకుండా నిజాయితీగా, పారదర్శకంగా ప్రజారంజకంగా పాలించిన నేత వాజ్ పేయి అని కొనియాడారు. పార్లమెంట్ బలనిరూపణలో ఏఐడీఎంకే అధినేత జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒకే ఒక్క ఓటు తక్కువై ప్రభుత్వాన్ని కోల్పోయారన్నారు. ఆనాడు ఇతర పార్టీల ఎంపీలు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ….. అంతకుముందు దేశాన్ని నడిపిన పాలకులు ఎంపీలను కొనుగోలు చేసి ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపి ప్రజాస్వామ్య విలువలకు పాతరేసిన దాఖలాలున్నప్పటికీ…. నేను ప్రజల వద్దకే వెళతానే తప్ప ఇట్లాంటి నీతిమాలిన పనులు చేయబోనంటూ ఏకంగా అత్యున్నత ప్రధానమంత్రి పదవినే వదులుకుని తిరిగి ఎన్నికల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నిజాయితీపరుడు వాజ్ పేయి జీవితం నేటి రాజకీయ నేతలకు, పాలకవర్గాలకు ఆదర్శనీయమన్నారు.

గాంధీజీ కలలు కన్న రామ రాజ్యం… గ్రామ స్వరాజ్య స్థాపన కోసం నిరంతరం పరితపించి అమలు చేసిన మహానీయుడన్నారు. గ్రామీణ సడక్ యోజనతో దేశంలోని అన్ని మారుమూల గ్రామాలకు రోడ్లు వేసిన ఘనత వాజ్ పేయి గారిదేనన్నారు. స్వర్ణ చతుర్భుజీ పేరుతో 4 లేన్లు, 6 లేన్ల జాతీయ రహదారులను ఏర్పాటు చేసి ప్రజలకు రవాణా మార్గాలను సులభతరం చేసిన దూరదృష్టి కలిగిన నాయకుడన్నారు. ఎయిర్, రైలు కనెక్టవిటీ విషయంలోనూ వాజ్ పేయి ముందుచూపు అందరికీ ఆదర్శనీయమన్నారు. వాజ్ పేయి ఆలోచనలకు అనుగుణంగా ఆయన బాటలో నడుస్తూ నేడు భారత్ ను విశ్వగురుగా తీర్చిదిద్దుతున్న నాయకుడు నరేంద్రమోదీ అన్నారు. 2 వందల 2‌5 కోట్లకుపైగా కరోనా డోసులతో దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన ప్రాణదాత అన్నారు. అలాంటి వ్యక్తి మళ్లీ ప్రధాని కావడం ఈ దేశానికి అవసరమని, అందుకే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ అందించి ముచ్చటగా మూడోసారి మోదీని ప్రధానిని చేద్దామని, ఈ దేశ ప్రగతిలో భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు.
నిధులను ఉపసంహరించుకోవాలి…
ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతే సంస్థ సమావేశాలకు ప్రభుత్వం నిధులెట్లా విడుదల చేస్తుందని సంజయ్ ప్రశ్నించారు. దీనివల్ల ముస్లిం పేద సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఉగ్రవాదులను తయారు చేయడంతో పాటు బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడే సంస్థ తబ్లిక్ జమాతే సంస్థకు నిధులివ్వడం వెనుక ఉద్దేశమేందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *