పండుగ రోజే విషాదం.. మట్టిపడి ముగ్గురు విద్యార్థుల మృతి

0
  • ఆనందంగా గడిపి.. క్షణాల్లో మృత్యువోడిలోకి..
  •  మిన్నంటిన రోదనలు, రెండు గ్రామాల్లో విషాదఛాయలు
  •  మృత్యువుగా వచ్చిన మట్టి టిప్పర్
  •  మృతులు ఒకే కుటుంబానికి చెందిన విద్యార్థులు

హుజురాబాద్:
అవ్వ మేము బాగా చదువుకుంటాము. మీకు కష్టాలు రాకుండా చూసుకుంటాము. మాకోసం మీరు ఎంతో కష్టపడుతున్నారు. కూలీ పనులు చేసి మమ్మల్ని చదివిస్తున్నారు. మీ కష్టాలను మేము వృధా కానీయం మంచి ఉద్యోగాలు సాధించి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం..విజయ్, వర్ష వాళ్ళ అమ్మతో చెప్పిన మాటలు.. గంట వీరస్వామి రైస్ మిల్లు హమాలి కార్మికునిగా, రేణుక కూలి పనులు చేస్తూ బిడ్డ, కొడుకును బాగా చదివిస్తున్నారు. కాగా పండుగ రోజు చేతికి అంది వచ్చే కన్న బిడ్డలు ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లిలో పెద్దమ్మతల్లి బోనాల జాతర జరుగుతుంది. శుక్రవారం అర్ధరాత్రి గంట విజయ్ (17) వర్ష (15), సింధూజ (18) జాతర నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఎలబోతారం నుంచి హుజూరాబాద్ వైపు వస్తున్న మట్టి టిప్పర్ ను చూసి భయంతో మూలమలుపు వద్ద ఆగారు. టిప్పర్ వేగంగా వచ్చి వారు ఆగిన చోట ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో టిప్పర్లో ఉన్న మట్టి వర్ష, విజయ్, సింధూజ లపై పడింది.

గమనించిన గ్రామస్థులు వెంటనే వచ్చి మట్టిని తొలగించి వర్షను బయటకు తీసి 108లో హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మట్టిలో కూరుకుపోయిన విజయ్, సింధూజలను జేసీబీ సాయంతో బయటకు తీశారు. అప్పటికే వారు మృతిచెందారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకొని గుండెలు అవిసేలా విలపించారు. పోలీసులు చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం హుజూరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

రెండు గ్రామాల్లో గ్రామాల్లో విషాదం..
ఆ రోజంతా వారు హాయిగా గడిపారు. పండుగ కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులతో సందడి చేశారు. కులదేవత పండుగను పెద్దలు చేసే ఆచార వ్యవహారాలను అర్ధరాత్రి వరకు తిలకించారు. కొద్ది నిమిషాలైతే ఇల్లు చేరుకునే వారు..కానీ మృత్యువు టిప్పర్ రూపంలో వచ్చి వారి ప్రాణాలను కబళించి వేసింది. అప్పటిదాకా ఆనందంగా ఉన్న వారి కుటుంబంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. దీంతో హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

నిలుచున్న చోటే సజీవ సమాధి…
సైదాపూర్ మండలం గోడిశాల గ్రామం నుంచి మట్టి నింపుకొని అతివేగంగా హుజురాబాద్ వైపు వస్తున్న లారీని వారు గమనించి భయంతో రోడ్డు పక్కకు ఆగి నిలుచున్నారు. వారు నిలిచి ఉన్న చోటనే వేగంగా వచ్చిన మట్టి లారీ (టిప్పర్) బోల్తాపడింది. దింతో టిప్పర్లోని మట్టి వారిపై పడడంతో వారు అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు. వెంటనే గమనించిన స్థానికులు మట్టిని తొలగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో జెసిబి సాయంతో మట్టిని తొలగించారు. అప్పటికే వారు ఊపిరాడక మట్టిలోనే ప్రాణం వదిలారు.

విజయ్ ఇంటర్ మొదటి సంవత్సరం, వర్ష పదవ తరగతి, సింధూజ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. విజయ్, వర్ష సొంత అన్నాచెల్లెలు కాగా సింధూజ వారి పెదనాన్న కూతురు. సింధుజ తండ్రి గంట శ్రీకాంత్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా సింధుజ అమ్మమ్మ గ్రామమైన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ లో తల్లితో కలిసి ఉంటుంది. బోనాల పండుగకు రావాలని సింధుజకు వాళ్ళ తాత ఫోన్ చేసి చెప్పడంతో బోర్నపల్లికి వచ్చింది. మృతురాల సింధూజ కు తమ్ముడు హర్షిత్, తల్లి ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతుల కుటుంబాలకు సంతాపం..
బోర్లపల్లిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *