అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందాలి

0

ఇంటింటికీ కేంద్ర పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం..
. అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందించడమే ఉద్దేశం
. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
. కరీంనగర్ కలెక్టర్ తో కలిసి జెండా ఊపి వికసిత్ యాత్ర ను ప్రారంభించిన బండి

కరీంనగర్:
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మారుమూల గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడంతో పాటు అర్హులందరికీ కేంద్ర పథకాలు అందేలా చేయడమే ‘‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’’ ప్రధాన లక్ష్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. శనివారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ‘‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’’ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ప్రచార రథంలో ఎల్ ఈడీ స్క్రీన్ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్ని లైవ్ లో వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… వికసిత భారత్ లక్ష్యాలను, ఉద్దేశాలను వివరించారు. ప్రధానమంత్రి మోడీ ఈ పదేళ్లలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. గొంతెత్తి మాట్లాడలేని పేదల కోసం గొప్ప గొప్ప పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందిస్తున్నారన్నారు. 4 కోట్ల మంది పేదలకు ఇండ్లు నిర్మించారని, కోట్లాది మంది రైతులకు సబ్సిడీపై ఎరువులు అందిస్తున్నారని, కిసాన్ సమ్మాన్ నిధి కింద నగదు జమ చేస్తున్నారని తెలిపారు. ఉజ్వల్ యోజన కింద ఉచితంగా కోట్లాది మందికి గ్యాస్ కనెక్షన్లు అందించారన్నారు. కేంద్రం అమలు చేసే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నట్లుగా ఇన్నాళ్లు బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ది పొందాలనుకున్నారని విమర్శించారు.

రాజకీయాలకు అతీతంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు అర్హులకు ఈ పథకాలను చేరువ చేయాలనే ప్రధాన లక్ష్యంతోనే వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. అధికారులు పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలన్నారు. నిజాయితీగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందని లబ్ధిదారులకు వేగంగా వాటిని చేరేలా చేయాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని మారుమూల గ్రామాల్లోని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు కూడా అర్ధమయ్యేలా వివరించి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కరీంనగర్ వ్యవసాయ ఆధారిత జిల్లా…యువత అత్యధికంగా ఉన్న జిల్లా.. మనం అవునన్నా కాదన్నా… రైతన్నకు పంట పెట్టుబడి వ్యయం పెరిగింది. పెరిగిన కూలీ వేతనాలు భరించే స్థాయిలో రైతుల్లేరు. అట్లాగే అకాల వానలతో పంట నష్టపోతే దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నరు… వారిని ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం సబ్సిడీపై ఎరువులు అందిస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తోంది. ఫసల్ బీమా పేరుతో పంట నష్టపోయిన రైతును ఆదుకుంటోంది. కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేసి పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవడమే కాకుండా పంట దిగుబడి ఎట్లా పెంచుకోవచ్చో చెబుతోంది. డ్రోన్లను ఉపయోగించి ఎరువులు చల్లి పెట్టుబడి వ్యయాన్ని ఎట్లా తగ్గించుకోవచ్చో చెబుతోంది. మీరు చేయాల్సిందల్లా వీటిపై ప్రజలకు అవగాహన కల్పించడమే. అందుకోసం రూపొందించిన కార్యక్రమమే ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర. ఇక్కడున్న యూత్ కు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు కేంద్రం ఎన్నో స్కిల్డ్ డెవెలప్ కార్యక్రమాలను అమలు చేస్తోంది. టెక్నాలజీలో దూసుకుపోతున్న యువతలో ఎవరైనా సొంతంగా స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవాలనుకుంటే కేంద్రం ప్రోత్సహిస్తోంది. యువతకు వాటిపై అవగాహన కల్పించాలన్నారు.

కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ దేశంలో పేదలు, యువత, మహిళలు, రైతులు ఈ నాలుగు పెద్ద కులాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని మోడీ చెప్పారన్నారు. అందుకే ఈ నాలుగు కులాల సాధికారతే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. మారుమూలన ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని, తద్వారా భారత్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్ది విశ్వగురుగా మార్చాలన్నదే మోదీగారి లక్ష్యం అన్నారు. ఆ గొప్ప ఆశయానికి అండగా ఉండాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే అధికారుల భాగస్వామ్యంతోపాటు రాజకీయాలకు అతీతంగా మీడియా, మేధావుల, విద్యావేత్తల, స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములు కాావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *