ఓటమి చెందిన సీనియర్లు వీరే…

కరీంనగర్ లో కాంగ్రెస్ హవా..
. అసెంబ్లీలోకి తొలిసారిగా 8 మంది అభ్యర్థులు
. ఓడిన సీనియర్లు..

కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. 2018 ఎన్నికల్లో ఒక స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 8 సీట్లను సాధించి సత్తా చాటింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 8 స్థానాలు గెలుపొందింది. బిఆర్ఎస్ పార్టీ కేవలం ఐదు స్థానాలకే పరిమితం అయ్యింది. ఉమ్మడి జిల్లాలో జగిత్యాల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ప్రత్యర్థి అడ్లూరు లక్ష్మణ్ పై గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురైంది. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి బిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ల మధ్ రౌండ్ రౌండ్ కు హోరాహోరి పోరు కొనసాగింది. 3వేల పైచిలుకు ఓట్లతో మంత్రి గంగుల గెలుపొందారు.

తొలిసారి అసెంబ్లీలోకి…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎనిమిది మంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. జిల్లాలో కాంగ్రెస్ కు సంబంధించి మానకొండూరు, చొప్పదండి, రామగుండం, హుస్నాబాద్, వేములవాడ, ధర్మపురి అభ్యర్థులు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మక్కాన్ సింగ్ ఠాకూర్, పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో పాటు బిఆర్ఎస్ కు చెందిన హుజరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్లు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

ఓడిన సీనియర్లు…
జిల్లాలో ఓటమి ఎరుగని నాయకులుగా పేరు ఉన్న మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
ఈటల రాజేందర్…
2004 నుంచి 2009, 2010 ఉపఎన్నిక, 2014, 2018లో వరుసగా నాలుగు పర్యాయాలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హుజరాబాద్ లో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై గెలుపొందారు. 2004 నుంచి ఎదురులేని నేతగా హుజూరాబాద్ లో తన సత్తా చాటుతూ వస్తున్న ఈటల ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి పై ఓటమిపాలయ్యారు.
జీవన్ రెడ్డి…
సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి మళ్లీ తప్పని ఓటమి
జగిత్యాల ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ కె పట్టం కట్టారు. జీవన్ రెడ్డి 1983 నుంచి వరుసగా 1989, 1996(ఉప ఎన్నిక), 1999, 2004, 2014 ఎన్నికల్లో ఆరుసార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో మంత్రిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిచవి చూసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. ఈసారి 15822 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
కొప్పుల ఈశ్వర్…
2004 నుంచి వరుసగా 2018 ఎన్నికల వరకు ఓటమెరుగని నేతగా ఎదిగిన కొప్పుల ఈశ్వర్ కు ఈ ఎనికల్లో పరాభవం తప్పలేదు. ఇన్నేండ్ల తన రాజకీయ ప్రస్థానంలో చివరిసారి మంత్రిగా పని చేశారు. అయితే గత 2018 ఎన్నికల్లోనే స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. 2009 నుంచీ ఈశ్వర్ పై గెలుపు కోసం పోరాడుతున్న లక్ష్మణ్ కుమార్ కు ఈసారి అక్కడి ప్రజలు 22039 ఓట్ల మెజార్టీని అందించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఆరుసార్లు వరుస విజయాలు సాధించిన కొప్పుల ఈశ్వర్ ఎన్నికల్లో ఓటమి చెందారు.