జ్ఞానం లభించే ప్రపంచం ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’

0

ఏటా డిసెంబర్ మాసంలో హైదరాబాద్ ఎన్. టి.ఆర్.స్టేడియం లో నిర్వహించే బుక్ ఫెయిర్ రెండు నెలల ఆలస్యంగా ఫిబ్రవరి 9,2024 న ప్రారంభమైంది. పుస్తక ప్రదర్శన స్థలానికి ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రాంగణంగా నాకరణ చేశారు.గద్దర్ రచనలు కూడా ఆరవ నంబర్ షాపులో అందుబాటులో పెట్టారు.అలాగే రవ్వా శ్రీహరి పేర ఏర్పాటు చేసిన వేదిక పై పుస్తకావిష్కరణలు,సభలు,సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా పుస్తక ప్రదర్శనలో పిల్లల నుండి మొదలు వృద్ధ పాఠకుల కు అన్ని రకాల పుస్తకాలను 360 కి పైగా షాపుల్లో అందుబాటులో ఉంచారు. వీటిలో రెండు వందలకు పైగా షాపుల్లో జాతీయ,అంతర్జాతీయ రచయితలు,మేధావులు,పరిశోధకులు వివిధ అంశాల్లో రాసిన పుస్తకాలను కొనుగోలు చేస్తూ యువతీయువకులు చేస్తున్న సందడి ఎక్కువగా కన్పించింది.అలాగే వందకు పైగా షాపుల్లో తెలుగు పుస్తకాలను అందుబాటులో ఉంచారు.వీటిలో అన్ని వయస్సుల వారికి,వారివారి అభిరుచులను బట్టి అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

పుస్తక ప్రదర్శనకు హాజరైన సందర్శకులను గమనించినట్టైతే పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గుతుందని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్న అభిప్రాయం కలిగింది. అన్ని సంపాదనలకన్నా,జ్ఞాన సంపాదన గొప్పదని నమ్మేవాళ్ల లో నేనొకన్నీ.జ్ఞాన సంపాదన పుస్తకాలతో పాటు సమాజాన్ని అధ్యయనం చేయడం వల్లనే లభిస్తుందని కూడా నమ్ముతాను.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ద్వారా నిర్వహిస్తున్న పుస్తక ప్రపంచంలో వయస్సుతో నిమిత్తం లేకుండా పాఠకలోకానికి అభిరుచిమేరకు జ్ఞానాన్ని పొందే జాతీయ,అంతర్జాతీయిలో ప్రచురించిన సుప్రసిద్ధ రచయితల పుస్తకాలు తెలుగు,ఇంగ్లీషు,హిందీ,ఉర్దూ భాషల్లో ఇక్కడ లభిస్తాయి.

శనివారం(10.02.2024) రోజున నేను,నా మనవరాళ్లు ఆవునూరి ప్రణీత,నాగపూరి సాయిభవిష్య,మనవడు ఆవునూరి కౌశిక్ తో కలసి పుస్తక ప్రదర్శనను సందర్శించడం జరిగింది.పిల్లలు షాపులను కలియ తిరుగుతూ వారి అభిరుచిమేరకు పుస్తకాలను కొనుగోలు చేశారు.నేను నాకు నచ్చిన పుస్తకాలను తీసుకున్నాను. ఈ క్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య గారు ఎదురుపడటంతో ఆయనతో కొద్దిసేపు మాట్లాడి ముందుకు వెళ్ళాను.ఆ తర్వాత అరుణతార నిర్వహిస్తున్న షాపులో”ఆధునిక సాహిత్య వేదిక సృజన-శ్రీశ్రీ సాహిత్య సమాలోచన” పుస్తకాన్ని తీసుకున్నాను.ప్రముఖ విప్లవ రచయిత వరవరరావు గారి సంపాదకత్వం లో విజయవాడ శ్రీశ్రీ సాహిత్య నిధి ప్రచురణగా సింగంపల్లి అశోక్ కుమార్ గారి కూర్పు లో మలి ముద్రణగా ఈ పుస్తకం వెలువడింది.

అనంతరం మానవహక్కుల వేదిక ఏర్పాటు చేసిన షాపులో డాక్టర్ బాలగోపాల్ గారు రాసిన పుస్తకాలతో పాటు,మానవహక్కుల వేదిక ప్రచురణలను అందుబాటులో పెట్టినట్టుగా మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల నాయకుడు జీవన్ కుమార్ గారు తెలిపారు. జీవన్ కుమార్ గారితో నాకు నాలుగున్నర దశాబ్దాలకు పైగా పరిచయం ఉంది.జీవన్ కుమార్ నా వెంట ఉన్న పిల్లలకు డాక్టర్ బాలగోపాల్ గారి గురించి రెండు నిమిషాల పాటు వివరిస్తూ,ఎన్ని అడ్డంకులు ఎదురైనా అన్ని అంశాలపై ఉన్నదున్నట్టు నిర్మోహంగా మాట్లాడే దేశంలోని పది మంది మేధావుల్లో డాక్టర్ బాలగోపాల్ గారు ఒకరిగా ఉంటారని చెప్పారు. ఆ తర్వాత ప్రముఖ కవి స్కైబాబ గారు నిర్వహిస్తున్న షాపు కన్పించింది.గతంలో మరో ప్రముఖ కవి తైదల అంజయ్య గారి ద్వారా స్కైబాబా పరిచయం.ఆయనను పలకరించి,అక్కడే”నేల లేని దేశం”పాలస్తీనా పై కవిత్వ పుస్తకాన్ని తీసుకున్నాను.

ఇక అదే సమయంలో ప్రజాగాయకులు గద్దర్ యాదిలో”పాటతో ఒక సాయంకాలం”పేరుతో సభను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు మైక్ లో చేసిన ప్రకటనతో అటువైపు వెళ్లాం. అక్కడ తెలంగాణ రాష్ట్ర తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్,జర్నలిస్ట్ ఉద్యమ నాయకుడు,కవి,రచయిత,సీనియర్ జర్నలిస్ట్ మిత్రులు అల్లం నారాయణ గారు,గద్దరన్న కుమారుడు సూర్య కిరణ్ లను కలసి కొద్ది సేపు మాట్లాడి ప్రాంగణం నుండి బయటకు నడిచాం. అన్ని తరాల పాఠకులు పుస్తక ప్రదర్శనను కుటుంబ సభ్యులతో సందర్శించి,భావితరాలను పుస్తక పఠనం వైపు నడిపించి జ్ఞానదాయకమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావలసిన అవసరం ఉంది.

– ఆవునూరి సమ్మయ్య, జర్నలిస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *