బహుముఖ ప్రజ్ఞాశాలి పివి

0

మన పి.వి. గురించి మన ముచ్చట్లు

(ఆవునూరి సమ్మయ్య)
మాజీ ప్రధాన మంత్రి, బహుభాషా కోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి పాములపర్తి వేంకట నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు జూన్ 28 – 2020 నుండి జూన్ 28 – 2021 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం మనందరికి తెలుసు. శత జయంతి ఉత్సవాల ప్రారంభం (28.06.2020) రోజున జర్నలిస్ట్ మిత్రులు వి.వేణుమాధవ్, కె నరసింహారెడ్డి పి.వి గారితో హుజురాబాద్ ప్రాంత జర్నలిస్టులు కలిసివున్న ఒక ఫొటోను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసారు. దాదాపు 22 సంవత్సరాల క్రితం ఫొటో అది. ప్రధానిగా విరమణ చేసిన తర్వాత పి.వి.గారు తేదీ13.09.1998 ఆదివారం రోజున హుజురాబాద్ పట్టణానికి వచ్చారు. స్వామి రామానంద తీర్థ ట్రస్ట్ స్వర్ణోత్సవాలలో భాగంగా భారత ఖాదీ బోర్డ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రస్తుత సాయిబాబా గుడి ప్రక్కన గల వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఇదే సందర్బంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఒక బహిరంగ సభ జరిగింది. పి.వి.గారి పర్యటన విశేషాల్ని కవర్ చేసేందుకు కరీంనగర్ నుండి వచ్చిన పాత్రికేయులతో పాటు హుజురాబాద్ ప్రాంత పాత్రికేయులు పాల్గొన్నారు. సభా వేదిక ముందు దాదాపు 50 అడుగుల దూరంలో పాత్రికేయులు (నేలపైనే) కూర్చునే విధంగా ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. సభలో పి.వి.గారు ప్రసింగించేందుకు లేవడంతో “మీకు హుజురాబాద్ ప్రెస్ క్లబ్ తరపున ఘన స్వాగతం” సర్ అని బిగ్గరగా నినదించడం జరిగింది. పి.వి. గారు తన ప్రసంగం ప్రారంభంలోనే “హుజురాబాద్ లో ప్రెస్ క్లబ్ ఉందా” ! అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూనే “మా రోజుల్లో వరంగల్ లో కూడా ప్రెస్ క్లబ్ ఉండేది కాదు…చాలా సంతోషం” అంటూ.. తన ప్రధాన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ప్రసంగం పూర్తయిన తర్వాత స్థానిక పాత్రికేయుల కోరిక మేరకు ఆయన ఫొటో దిగేందుకు అనుమతి ఇచ్చారు. ఆ ఫొటో చరిత్ర అప్పడిది. ఆ ఫొటోలో నేను, టి.ఆంజనేయ స్వామి, కోరేం సుధాకర్ రెడ్డి, అనుమాస రాజేందర్, కె.సురేష్ బాబు, బాణాల శ్యామ్ సుందర్, వల్లూరి వేణు మాధవ్, కె.నరసింహారెడ్డి, పి.శంతన్ రెడ్డి, ఇమ్మడి ఎల్లేశ్, కోల తిరుపతి తదితరులు ఉన్నారు. భారత దేశ ప్రధాన మంత్రిగా పనిచేసిన మహానీయునితో కల్సి ఉన్న ఫొటో చారిత్రాత్మకమైనది.

పి.వి.నరసింహారావు గారు జూన్ 21,1991 లో ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. హుజురాబాద్ కు సమీపంలోని వంగర గ్రామానికి చెంది పి.వి.నరసింహా రావు గారు జూన్ 21 – 1991 న భారత దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పుడు నేను హుజురాబాద్ నుండి “ఆంధ్ర ప్రభ” దిన పత్రికలో ఫ్రీలాన్స్ న్యూస్ కాంట్రీ బ్యూటర్ గా ఉండేవాడిని. ఆ రోజుల్లో గోయెంకా గ్రూప్ ఆప్ పబ్లికేషన్స్ నుండి వెలువడే “ఇండియన్ ఎక్స్ ప్రెస్” ఆంగ్ల పత్రికకు అనుబంధంగా తెలుగులో “ఆంధ్ర ప్రభ” దినపత్రిక వెలువడేది. అపుడు మండల, డివిజన్ స్థాయిల్లో వార్తలను సేకరించే వారిని “న్యూస్ స్ట్రింగర్స్” గా లేదా “కంట్రిబ్యూటర్స్” గా పిలిచేవారు. హుజురాబాద్ కు సమీపంలోని ఒక కుగ్రామంలో జన్మించిన పి.వి.గారు రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని అత్యున్నతమైన పదవిని నిర్వహిస్తున్నారన్న వార్తలతో హుజురాబాద్ పాత తాలుకా (పాత తాలుకా అంటే ఇటు కట్కూర్, కన్నారం గ్రామాల నుండి అటు వెల్ది, వేగురుపల్లి గ్రామాల వరకు) ప్రజల్లో ఒక పండగ వాతావరణం ఏర్పడింది. అంతకు ముందే పి.వి.గారి గురించి నాకు తెలుసు. నాకు తెలిసిన విషయాలతో సుదీర్ఘమైన వార్తాకథనాన్ని రాసాను. కానీ,దురదృష్టవశాత్తు ఆంధ్రప్రభ దిన పత్రిక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు ఎడిషన్లో సమ్మె వల్ల లాక్ ఔట్ ప్రకటించారు. ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితి. నిద్రపట్టని రాత్రులు గడిపాను. ఒక్క మద్రాస్ ఎడిషన్ పనిచేస్తుందని, రాత ప్రతిని మద్రాస్ ఎడిషన్ కు పంపించమని నా శ్రేయోభిలాషి ఆంధ్ర ప్రభలో బ్యూరో చీఫ్ గా ఉన్న సీనియర్ పాత్రకేయులు,జర్నలిస్ట్ సంఘ నాయకులైన దేవులపల్లి అమర్ గారు సూచించారు. అమర్ గారు చెప్పినట్టుగా రాత ప్రతిని పోస్ట్ ద్వారా మద్రాస్ ఎడిషన్ కు పంపించాను.అది చేరిందో లేదో తెలియదు. మద్రాస్ నుండి పత్రికలు ఇక్కడకు వచ్చేటివి కాదు. అలా 10 రోజులు గడిచిపోయాయి. ఒక రోజు అప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కేతిరి సాయి రెడ్డి గారిని కలిసేందుకు హుజురాబాద్ లోని వారి ఇంటికి వెళ్ళాను. మా ఇద్దరి మధ్య మాటల సందర్బంగా “పి.వి.గారి గురించి ఆంధ్రప్రభలో ఏమైనా రాశావా?” అని అడిగారు. ఉన్నవిషయం చెప్పాను. “నిన్న హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారు కలిసారు, పి.వి. గురించి హుజురాబాద్ నుండి ఆంధ్రప్రభలో బాగా రాయించారని నాతో అన్నాడు. నేను పత్రిక చూడలేదు అందుకే అడుగుతున్నాను” అన్నాడు. అప్పుడు అర్థమైంది నేను రాసిన వార్త మద్రాస్ ఎడిషన్లో ప్రచురించారని. మూడు రోజుల తర్వాత మద్రాస్ ఎడిషన్ నుండి నాకు పోస్ట్ లో ఆంధ్ర ప్రభ దిన పత్రిక అందింది. చూస్తే నా కళ్ళు బైర్లు కమ్మాయంటే నమ్మండి. ఆ పత్రిక ఎడిటోరియల్ పేజీలో మొత్తం నేను రాసిన వార్తా కథనం తొలి సారిగా నాబై లైన్ తో ప్రచురించబడింది. నాకు సంతోషం కలిగినప్పటికి, సమ్మె వల్ల పి.వి.గారి గురించి నేను రాసిన వార్తను నా ప్రాంత ప్రజలు చదవలేదన్న అసంతృప్తి నాలో ఇప్పటికి ఉంది.

పి.వి.గారు ప్రధాన మంత్రి అయ్యింది మొదలు ఒక నెల రోజుల పాటు నేను హుజురాబాద్, వంగర గ్రామాల మధ్యనే తిరగ వలసి వచ్చింది. కరీంనగర్లో ఆంధ్రప్రభ ప్రతినిధిగా, జిల్లా జర్నలిస్టుల సంఘం అధ్యక్షునిగా పనిచేసిన దేవులపల్లి అమర్ గారు అప్పటికే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని జర్నలిస్టుల సంఘానికి రాష్ట్ర నాయకులు. జర్నలిజంలో విశేషమైన అనుభవాన్ని గడించిన సీనియర్ జర్నలిస్ట్. కరీంనగర్ నుండి అమర్ గారు హైదరాబాద్ ఆంధ్ర ప్రభ బ్యూరో చీఫ్ గా వెళ్లడం జరిగింది. ఆ సమయంలోనే పి.వి.గారు ప్రధాన మంత్రి కావడంతో జాతీయ అంతర్జాతీయ మీడియా దృష్టి వంగర గ్రామం పై దృష్టిని సారించాయి. అనేక మంది జాతీయ మీడియా ప్రతినిధులు హైదరాబాద్ లోని ఇండియన్ ఎక్స్ ప్రెస్(ఆంధ్రప్రభ) కార్యాలయంలోని అమర్ గారిని సంప్రదించడం, అమర్ గారు వారికి హుజురాబాద్లోని నా అడ్రస్ ఇవ్వడం, వారితో కలిసి వంగరకు వెళ్లి పి.వి.గారి ఇంటిని, అందులో ఆయన తన మొదటి ఎన్నికల ప్రచారం కోసం వాడిన జీపును, పి.వి.గారి బాల్యస్నేహితులను కల్పించడం, గ్రామంలోని వీధులన్నీ తిరిగి ప్రజలతో మాట్లాడించడం… ఇలా సాగింది.

పి.వి.నరసింహారావు గారి స్వగ్రామమైన వంగరలో ప్రతి సంవత్సరం వారి కుటుంబ సభ్యులు వంగర గ్రామానికి వచ్చి కేదారీశ్వర వ్రతం జరుపుకోవడం ఆనవాయితీ. పి.వి.గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 1993 లేదా 94 లో కూడా ఈ వ్రతం జరుపుకునే సందర్బంగా హుజురాబాద్ ప్రాంతంలోని పాత్రికేయులను కూడా ఆహ్వానించారు. నేను, నాతో పాటు మరికొందరు పాత్రికేయులు, అలాగే భీమదేవపల్లి మండల పాత్రికేయులు కూడా వంగర వెళ్లాం. పి.వి.గారి ముగ్గురు కుమారుల లో ఒక్క పి.వి.రాజేశ్వర రావు గారు మాత్రమే వచ్చారు. పి.వి.రంగారావు (పెద్ద కుమారుడు), పి.వి.ప్రభాకర్ రావు (చిన్న కుమారుడు) రాలేదు. పి.వి.గారి కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్లు కూడా వచ్చారు. అలాగే పి.వి.గారి సోదరుల కుటుంబాలు కూడా వచ్చాయి. పి.వి.సోదరులలో ఒకరైన పి.వి.మనోహర రావు గారి కుమారుడు పి.వి.మదన్ మోహన్ రావు గారు మా టీంకు బాధ్యులు. పి.వి.మదన్ మోహన్ రావు గారితో నాకు నాలుగు దశాబ్దాలుగా పరిచయం, స్నేహం ఉన్నాయి. వారు పాత్రికేయ రంగంలోకి వచ్చినప్పటినుండి మదన్ గారితో పరిచయం. వ్రతం పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మదన్ మోహన్ గారు మమ్మల్ని అందరిని పి.వి.రాజేశ్వర్ రావు గారికి పరిచయం చేయడం జరిగింది. ఈ సందర్బంగా రాజేశ్వరరావు గారితో నేను మాట్లాడుతూ “సార్…ఇంతకాలం నెహ్రూ గారి కుటుంబమే దేశాన్ని పరిపాలించింది. అలాగే దేశ స్వాతంత్య్రానికి ముందు కూడా వారి కుటుంబం దేశవ్యాప్త ప్రచారం కలిగి ఉంది. నెహ్రూ కుటుంబానికి వారి పుట్టుకతోనే పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. మరి పి.వి.గారు ఒక మారుమూల గ్రామం నుండి వచ్చారు. ప్రధాని పి.వి.గారి కుటుంబ సభ్యులుగా మీ జీవన విధానంలో ఏమైనా మార్పుందా? అని ప్రశ్నిచడం జరిగింది. ఒక్క సారిగా రాజేశ్వర్ రావు గారి ముఖ కవళికల్లో గంభీరమైన మార్పులు కనిపించాయి. “అవును మీరన్నది నిజం. మా నాన్న గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మా కుటుంబ సభ్యులందరికి స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్.పి.జి) రక్షణ కల్పించారు. మాకు గతంలో ఇలాంటి అనుభవం లేదు. మాకు ప్రైవసి అంటూ లేదు. మేము ఒక కర్చీఫ్ కోనాలన్న పోలీసులు పరీక్షించవల్సిదే. మా సోదరి ఉపన్యాసాకురాలిగా పని చేస్తోంది. ఆమె పాఠాలు చెబుతున్న క్లాస్ చుట్టూ పోలీస్ కాపలా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా.. మన భోజనాలు చేస్తుంటే కూడా ఎంత మంది పోలీసులు మన చుట్టూ ఉన్నారో? మీరు ఈ గదిలోకి రావాలంటే ఎన్ని మార్లు తనిఖీ చేశారు కదా !.. వీళ్ళ డ్యూటీ లో భాగంగా మాకు రక్షణ కల్పిస్తున్నారు, కానీ మాకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి” అని గద్గద స్వరంతో చెప్పారు. రాజేశ్వర్ రావు గారు సున్నిత మనస్కులని చెప్పక తప్పదు. అనంతరం పి.వి.గారి ఇంట్లో మేమంతా సహపంక్తి భోజనానికి కూర్చున్నాం. కుటుంబసభ్యులు వడ్డించారు.

పి.వి గారు మరికొన్ని నెలల్లో పదవీ విరమణ చేస్తారంగా ప్రధాన మంత్రి హోదాలో వంగర గ్రామానికి వచ్చారు. మూడు ప్రత్యేక సైనిక హెలికాఫ్టర్లు వంగర గ్రామంలోని తన స్వంత భూమిలో దిగాయి. వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుండి వేలాది మంది పి.వి.ని చేసునందుకు వచ్చారు. పి.వి.గారి వార్తలను కవర్ చేసేందుకు ఆంధ్ర ప్రభ నుండి అప్పటి కరీంనగర్ జిల్లా ప్రతినిధి, ప్రస్తుత వి6 టీవీ చానల్ సి.ఈ. ఓ గా, వెలుగు దినపత్రక సంపాదకులు అంకం రవి గారు, హుజురాబాద్ నుండి నేను ఒక రోజు ముందే వంగర గ్రామానికి చేరుకున్నాం. అదే గ్రామునికి చెందిన వి.నారాయణ రెడ్డి ఇంట్లో ఆ పూటరాత్రి బస చేసాం. తెల్లవారిన తర్వాత హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రభ ప్రత్యేక ప్రతినిధి ఎస్.రామకృష్ణ కూడా వచ్చారు. స్వగ్రామంలో పి.వి.గారి హృదయం స్పందించిన తీరు ఆయన ప్రసంగంలో కన్పించింది. ఆ తర్వాత పి.వి.తన కుటుంబ సభ్యులను, స్నేహితులను, తాను పుట్టి పెరిగిన గ్రామ ప్రజలను కలసి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. పి.వి.గారి పర్యటన ప్రధాన వార్తను ప్రత్యేక ప్రతినిధి రాయగా, అంకం రవి గారు, నేను ప్రత్యేక కథనాలను అందించాం.

ఇకపోతే సాహిత్య పరంగా పి.వి.గారు రాసిన “గొల్ల రామవ్వ” కథ నాపై తీవ్ర ప్రభావాన్ని కలిగించింది.1949 లో కాకతీయ పత్రికలో పి.వి గారు రాసిన ఈ కథ ఆనాడు నిజాం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఉద్యమ కారులను ప్రజలు ఎలాకాపాడుకున్నారో గొల్ల రామవ్వ రూపములో అద్భుతంగా రాశారు. కథలో అప్పటి తెలంగాణా ప్రజల వ్యవహారిక పదాలు కోకొల్లలుగా దొరుకుతాయి. అలాగే కథను మనస్సుకు అతుక్కుపోయేలా రాయడం పి.వి.గారి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇంకా నేను పి.వి గారు రాసిన ఇన్ సైడర్(లోపలి మనిషి) తెలుగు అనువాదాన్ని ఆంధ్రప్రభ దినపత్రికలో సీరియల్ గా ప్రచురించినప్పుడు చదివాను. ఎలాంటి అరమరికలు లేకుండా రాజకీయాలలో ఆవధులు దాటిన పరిస్థితులను కళ్ళకు కట్టారు. ఎమెస్కోవారు వేసిన పుస్తకాన్ని పి.డి.ఎఫ్.లో మొన్ననే నాకు వాట్సాప్లో పంపించారు.

పి.వి.గారు ముఖ్యమంత్రి గా పనిచేసినప్పుడే భూసంస్కరణల చట్టం తీసుకు వచ్చి తన భూములను నిరుపేదలకు పంపిణీ చేశారు. పి.వి.గారు ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత కరీంనగర్ జిల్లా నక్సలైట్ నాయకుడు ప్రసాద్ పి.వి.గారి భూముల పై చేసిన ఆరోపణలతో, అప్పటి జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఆనాడు కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన పి.వి.రమేష్ గారి చేత పి.వి.భూములపై సమగ్ర సర్వే ను చేయించింది. జాయింట్ కలెక్టర్ గారు కొన్ని రోజులు వంగర గ్రామంలోనే బస చేయవలసి వచ్చింది. మిగులుగా తేలిన భూమిని పేద ప్రజలకు పంపిణీ చేశారు.

ఆవునూరి సమ్మయ్య
టీ – జాక్ కన్వీనర్
సీనియర్ జర్నలిస్ట్ & అనలిస్ట్
హుజురాబాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *