మానవాళికి సవాలుగా మారుతున్న కోతుల బెడద

0

 

మొన్న ఈమధ్య పెద్దపల్లి జిల్లాలోని ఒక అటవీ ప్రాంత గ్రామానికి ఒక అధ్యయన నిమిత్తం వెళ్లినప్పుడు ఆ ప్రాంతంలో గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు తుమ్మ చెట్లు, చింత చెట్లు కొడుతున్నారు.వీటితోపాటు అక్కడక్కడ ఉన్న పెద్ద పెద్ద రేగు చెట్లను కూడా కొట్టేశారు.చెట్లను కూడా ఎందుకు కొడుతున్నారో నాకు అర్థం కాలేదు.ఉండబట్ట లేక అక్కడున్న వారిని అడిగాను.వారు చెప్పిన సమాధానంనన్ను కలిచి వేసింది.వారి సమాధానం వారి మాటల్లో ‘ఊరంతా కోతులు ఎక్కువైనాయి సారు..అందుకే ఈ చెట్లను కొడుతున్నాం. కోతులతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అందుకే వాటిని కొట్టేశాం ‘అని కరాఖండిగా చెప్పేశారు.

వ్యవసాయ క్షేత్రాల పై దాడులు:

నిజానికి పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రమైన సమస్య.దీనికి సరైన పరిష్కార మార్గం లేక గ్రామీణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా రైతులు కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఇంటి చుట్టూ ఫెన్సింగ్ పెట్టుకొని కొంతవరకు వాటి బెడదను తప్పించుకుంటున్నారు.కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతవరకు అరికట్టగలరు? ఏ పంటను వెయ్యాలన్న కోతుల బెడదతో ఏ పంట వేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పుడు వ్యవసాయ భూముల్లో కూరగాయల పంటలు చాలావరకు తగ్గినవి.

మనుష్యులు కోతుల మధ్య సంఘర్షణ

ఇప్పుడు మనుష్యులకు కోతులకు మధ్య ఒక తీవ్రమైన సంఘర్షణ ఏర్పడింది. పంటలకు చీడ పీడ సమస్యల కంటే కోతుల వల్ల కలిగే నష్టమే ఎక్కువ అని రైతులు వాపోతున్నారు. వాణిజ్య పంటలు కూడా వేయలేకపోతున్నామని వారు వాపోతున్నారు.వరి గొలుసులు కూడా తెంపి వరిమడులను , కూరగాయల చెట్లను, పండ్ల చెట్లను చెల్లాచెదురు చేయడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుందని రైతులు దిగులు పడుతున్నారు. కొన్నిచోట్ల పంటలు వేయక భూములన్ని కూడా బీడుగా వదిలేసామని అంతేకాకుండా కౌలు రైతులు కూడా ఎవరు కౌలుకు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆహార సంక్షోభం:

ఇంకా ఇంటి పరిసరాల్లో కూడా ఎవరు కూరగాయల మడులు పెట్టడం లేదు.అసలు విత్తనాలు మొలకెత్తే అవకాశం కూడా కోతులు ఇవ్వడం లేదు.మొలకెత్తిన వాటి కోతులు తెంపి విరచి నాశనం చేస్తున్నాయి.కోతుల బెడదకి చాలా గ్రామీణ ప్రాంతాల్లో పెద్దపెద్ద చెట్లను నరికేస్తున్నారు. కోతుల బెడద అనేది ఇప్పుడు పర్యావరణానికి ఒక పెను సవాలుగా మారింది.పొలాల దగ్గర ఉండే చెట్లను కూడా వీటి బెడద కారణంగా తొలగిస్తున్నారు.వీటిని స్వైర విహారానికి తగిన పరిష్కార మార్గం అన్వేషించకపోతే రానున్న కాలంలో ఆహార పంటల కొరత యావత్ డేశాన్ని ఆందోళనకు గురి చేయవచ్చు అనేది నిపుణుల మాట.

జీవ వైవిధ్యానికి పొంచిన  ముప్పు:

కోతులు కేవలం వ్యవసాయ క్షేత్రాలపై మాత్రమే దాడి చేయడం లేదు.పక్షుల గూళ్లపై దాడులు చేసి వాటి గుడ్లను చెల్లాచెదురు చేసి తినేస్తున్నాయి.చిత్తడి నేలల్లో లోని గుడ్లుపెట్టే పక్షి జాతుల గుడ్లను కూడా తినేస్తున్నాయి.చెట్ల పువ్వులను , పిందెలను , కాయలను సైతం కొరికి పడేసి చిద్రం చేస్తున్నాయి.దీనివల్ల జీవ వైవిధ్య వ్యవస్థకు తీరని విఘాతం కలుగుతున్నది.దీనివల్ల పక్షి జాతులు కానీ , వృక్ష జాతులు కానీ మనుగడ సాగించలేవు.తద్వారా జీవ వైవిధ్య సమతుల్యత దెబ్బతినడం జరుగుతుంది.

మానవ తప్పిదాలు:

ఒకప్పుడు అడవుల్లోనే ఉండే కోతులు ఇప్పుడు ఎందుకు జనావాసాల పై దాడి చేస్తున్నాయి ?ఎందుకు పంటచేలా పైకి దాడి చేస్తున్నాయి ?అని ఆత్మ విమర్శ చేసుకోగలిగితే ఇది పూర్తిగా మానవ తప్పిదాల అడవుల నరికివేత వల్ల మరియు కొండలు గుట్టలు అన్ని కూడా క్వారీలుగా మారిపోవడం వల్ల ఆవాస నష్టాలు కలిగి కోతులు గ్రామీణ ప్రాంతాలపై దాడి చేయడం అనేది తీవ్రమైపోయినది.అంతేకాకుండా అడవుల్లో ఉండే కోతులకు ఆహార కోరత ఏర్పడి సమీప రహదారుల పైకి రావడం వాహనదారులు వేసే ఆహారానికి అలవాటు పడి సొంతంగా ఆహార అన్వేషణ కొనసాగించలేక పోతున్నాయి. ఇప్పుడు రహదారుల సమీపంలోనే ఉంటున్నాయి.వాహనాదారులు వేసే చిరుతిళ్ళ వల్ల ప్రతిరోజు కొన్ని వందల కోతులు మృత్యువాత పడుతున్నాయని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.రహదారుల వెంట ఆహారం లేని పక్షంలో ఆహార అన్వేషణ లో గ్రామాలపై మనుషులపై దాడి చేస్తున్నాయి.

నియంత్రణ చర్యలు:

జువాలజిస్టుల అధ్యయనం ప్రకారం కోతుల జీవితకాలం 24 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు.వీటి గర్భధారణ కాలం 164 రోజులు ఆడ కోతికి మూడు సంవత్సరాలు మగ కోతికి నాలుగేళ్లు వచ్చేసరికి సంతాన ఉత్పత్తికి సిద్ధమవుతాయి.అంటే ఒక కోతి జీవిత కాలంలో పది నుండి 15 కోతులకు జన్మనిస్తాయి.మెటర్నల్ రక్షణ అనగా ఎక్కువగా ఉండటంతో డెత్ రేట్ తక్కువగా ఉండటం వల్ల ప్రతి 10 కోతి పిల్లల్లో 9 కోతి పిల్లలు బతుకుతాయి.ఈ విధంగా చూసుకుంటే రాబోయే 10 ఏళ్లలో రాష్ట్ర జనాభాను దాటేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2018 లో రాష్ట్ర ప్రభుత్వం కోతుల బెడద నివారించడానికి 30 కోట్ల రూపాయలు వెచ్చించి కోతులను పట్టి అడవుల్లో వదిలేసిన మళ్లీ అవి తిరిగి గ్రామీణ ప్రాంతాలకే చేరుకున్నాయి. కోతుల బెడద నియంత్రణకు సరైన పరిష్కార మార్గాలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో వ్యవసాయం సంక్షోభం లో పడి ఆహార కొరత తీవ్రతరం కావడం పర్యావరణ విఘాతం కలగడం ఖాయమని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

– శ్యామ్ సుందర్ శర్మ చెలుపూరి,

-సెక్రెటరీ , ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ NGO – వరంగల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *