తొలివేటు వారిపైనే.. ఇప్పటికే లిస్టు సిద్ధం!

రేవంత్‌ ప్రభుత్వంలో తొలివేటు వారిపైనే.. ఇప్పటికే లిస్టు సిద్ధం!

. భారీగా ఐపీఎస్‌ల మార్పు?

. ఇప్పటికే లిస్టు సిద్ధం చేసినట్టు సమాచారం

. ఎస్సై నుంచి డీఎస్పీ వరకూ స్థానచలనం*

. అనతికాలంలోనే పోలీసుశాఖలో భారీమార్పు?

హైదరాబాద్‌:-కాంగ్రెస్‌ కొత్త ప్రభుత్వంలో ఈసారి ఐపీఎస్‌లలో భారీగా మార్పులు ఉండనున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నేత జగ్గారెడ్డి ఓ టీవీ డిబేట్‌లో మాట్లాడుతూ.. ‘గతంనుంచి కాంగ్రెస్‌ పార్టీ వారిని ఇబ్బందిపెట్టిన ఐపీఎస్‌, ఐఏఎస్‌ల లిస్టు మా పార్టీ దగ్గర, మా పీసీసీ అధ్యక్షుడు (రేవంత్‌డ్డి) దగ్గర ఉన్నది. అధికారంలోకి రాగానే ఎవ్వరినీ వదలం’ అని బహిరంగంగా హెచ్చరించారు. ‘ఇకనైనా తెలివి తెచ్చుకోండి’ అంటూ మందలించారు. ‘అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపీఎస్‌లను, ఐఏఎస్‌లను బెదిరించుకొనే హక్కు కూడా లేదా’ అంటూ జగ్గారెడ్డి జర్నలిస్టులను ఎదురు ప్రశ్నించారు. డీఎస్పీల నుంచి సీఐలు, ఎస్సైల వరకూ అందర్నీ మార్చేస్తామని పరోక్షంగా చెప్పారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఐపీఎస్‌లపై తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు.

వారికి పోస్టింగ్‌ ఎక్కడ?

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం తెలంగాణలో మొత్తం 20 మంది అధికారులను బదిలీ చేసింది. వారిలో 13 మంది పోలీసు ఉన్నతాధికారులున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు సీవీ ఆనంద్‌, రంగనాథ్‌, సత్యనారాయణకు నేటికీ ఎలాంటి పోస్టింగ్‌ లేదు. ఎన్నికలు సజావుగా జరిగినా, ఎన్నికల కోడ్‌ ముగిసినా వారి పోస్టింగ్‌లపై నేటికీ సందిగ్ధత నెలకొన్నట్టు పోలీసు వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. వీరితోపాటు సంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, గద్వాల్‌, మహబూబాబాద్‌, భూపాలపల్లి, నారాయణపేట, సూర్యాపేట ఎస్పీలు రమణకుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, భాసర్‌, కే నర్సింహ, మనోహర్‌, సృజన, చంద్రమోహన్‌, కరుణాకర్‌, వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్‌కు సైతం నేటికీ పోస్టింగ్‌ లేదు. హైదరాబాద్‌ నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీవీ ఆనంద్‌ చురుగ్గా విధులు నిర్వర్తించారు.

నగరంలో శాంతిభద్రతలను పటిష్ఠంగా అమలు చేయడంతోపాటు డ్రగ్స్‌ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. సైబర్‌ క్రైమ్స్‌ను అదుపుచేసేందుకు తనదైన శైలి ప్రదర్శించారు. డీజీపీ క్యాడర్‌ కలిగిన సీవీ ఆనంద్‌కు ఇప్పటి వరకూ పోస్టింగ్‌ ఇవ్వలేదనే చర్చ విస్తృతంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రాచకొండ, సైబరాబాద్‌ కమిషనర్లు కూడా కొనసాగిస్తారా? మార్చుతారా? అనే చర్చ ప్రారంభమైంది. హైదరాబాద్‌ నగరంసహా.. అన్ని జిల్లాల్లో, కమిషనరేట్లలో తమకు అనుకూలంగా ఉండే అధికారులనే నియమించుకుంటారనే వాదన పోలీసు వర్గాల్లో సైతం వినిపిస్తున్నది.

మొదట ఐపీఎస్‌లపైనే వేటు…

మొదటినుంచి తెలంగాణలో బీహార్‌ అధికారుల పాలన నడుస్తున్నదని, దానిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గతంలో రేవంత్‌రెడ్డి చెప్పారు. నాటి నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రతిపక్షాలపై అణచివేత ధోరణి ప్రదర్శించిన పలువురు ఐపీఎస్‌ల లిస్టును రేవంత్‌రెడ్డి సిద్ధం చేసుకొన్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ క్రమంలో ఈ వారంలోనే ఐపీఎస్‌ల నుంచి ప్రక్షాళన మొదలుపెడతారని తెలిసింది. మొన్నటివరకు డీజీపీగా వ్యహరించిన అంజనీకుమార్‌ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ సస్పెన్షన్‌కు గురికాగా.. ఆయన తర్వాత రేవంత్‌ లిస్టులో పలువురు ప్రముఖ ఐపీఎస్‌లు ఉన్నట్టు తెలుస్తున్నది. వీరిలో ముగ్గురు ఏడీజీలు కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రముఖంగా ఆయా జిల్లాల్లోని ఎస్పీలు, సీపీలపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బదిలీ వేటు వేస్తుందనే చర్చ పోలీసు వర్గాల్లో మొదలైంది. ఎన్నికలకు ముందు ఎవరైతే ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహరించారో.. ముందుగా వారిపైనే బదిలీవేటు వేస్తారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ మార్పులు కూడా కేవలం కొద్దిరోజుల్లోనే మొదలవనున్నట్టు సమాచారం