కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

2

ప్రజల్లో మార్పు తేవడమే వికసిత్ భారత్ లక్ష్యం…
. ప్రపంచానికే ఆదర్శంగా భారత్…
. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

కరీంనగర్:
దేశంలోని మారుమూల ప్రజల్లోనూ మార్పు తీసుకురావడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిందని మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు వేదిక కానేకాదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రకు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేయడంతోపాటు లబ్దిదారులంతా ఇక్కడికి తీసుకొచ్చి ప్రజలను భాగస్వాములను చేసిన బండి సంజయ్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ ప్రజలంతా ఎప్పుడైనా మధ్యప్రదేశ్ లోని తన నివాసమైన మామాజీ కా ఘర్ (మేనమామ ఇల్లు) కు రావాలని కోరారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తో కలిసి మానకొండూరు నియోజకవర్గంలోని కొండ పలకలకు విచ్చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ప్రత్యేక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం లబ్దిదారులతో మమేకమై కేంద్ర పథకాలవల్ల ఒనగూరిన ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు అర్హులైన వారందరికీ వాటి ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా అమలు చేస్తున్న కేంద్ర సంక్షేమ పథకాలను, దేశం సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఒకవైపు తీవ్రవాదాన్ని ఏరిపారేయడమే కాకుండా జమ్మూకాశ్మీర్ దేశంలో అంతర్భాగం చేయడంలో భాగంగా 370 ఆర్టికల్ ను రద్దు చేశారన్నారు. ముస్లిం హక్కులను కాపాడేందుకే ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని రద్దు చేశారని తెలిపారు.మోదీ పాలనలో దేశం సుసంపన్న, సుభిక్ష, శక్తిశాలీ దేశంగా మారుతోందన్నారు. ఆర్దిక ప్రగతిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ కాబోతుందన్నారు. కరోనాతో ప్రపంచమంతా అల్లాడుతుంటే అగ్రదేశాలకు సాధ్యం కాని రీతిలో ముందుగానే కరోనా వాక్సిన్ ను తయారు చేసి 200 కోట్ల డోసులను ఉచతంగా పంపిణీ చేసిన ఘనత మోదీదేనన్నారు. వీటితోపాటు 4 కోట్ల మంది ఇండ్లు నిర్మించారని, ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించారని, 10 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందించారని… 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం, గోధుములు అందిస్తున్నారని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు మోదీ విప్లవాత్మక చర్యలు తీసుకున్నారని, రైతులు, చిరు వ్యాపారులు రుణాలందక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నుండి కాపాడేందుకు బ్యాంకులే వారి వద్దకు వెళ్లి రుణాలిచ్చేలా చేసిన ఘనత మోదీదేనన్నారు. కరీంనగర్ లో జరుగుతున్న వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలతో మమేకమైన తరువాత మోదీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయనే భావన కలుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జల్లా కలెక్టర్ పమేలా సత్పతితోపాటు ఇతర శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

2 thoughts on “కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *