ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి

0

నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి
. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్
. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నామినేషన్ల ప్రక్రియపై సమీక్ష
కరీంనగర్:
లోక్ సభ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నేపథ్యంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై అన్ని జిల్లా కలెక్టర్లతో బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కరీంనగర్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన అంశాలను వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ నుంచి పరిశీలన.. ఉపసంహరణ వరకు రిటర్నింగ్ ఆఫీసర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో నిబంధనలు పాటించేలా చూడాలని సూచించారు. అభ్యర్థుల వెంట వచ్చేవారు.. వాహనాల సంఖ్యను నిబంధన మేరకు అనుమతించాలని ఆదేశించారు. నామినేషన్ల నుంచి పోలింగ్ జరిగే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. స్టాటస్టిక్ సర్వే లైన్స్ టీమ్ లు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సువిధ కింద ప్రచార సభలు సమావేశాలకు సంబంధించి అనుమతులను వెంటవెంటనే ఇవ్వాలని తెలిపారు. సి విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ప్రచారానికి సంబంధించి వచ్చే పోస్టులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ముద్రణ సమయంలో సింబల్ అలాట్మెంట్ జాగ్రత్తగా జరిగేలా చూడాలని తెలిపారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, సిరిసిల్ల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఆర్ఓ పవన్ కుమార్, కరీంనగర్ హుజురాబాద్ ఆర్డీవోలు కే మహేశ్వర్, రమేష్ బాబు, అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *