తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి…

తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి…

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ముఖ్యమంత్రిగా పని చేశారు. కాగా మూడవ సీఎంగా రేవంత్ రెడ్డి ఈ నెల 7న బాధ్యతలు చేపట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇక లేదన్న క్రమంలో పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించిన రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని సీఎం అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేశారు. రెండురోజులపాటు చర్చించిన కాంగ్రెస్ అధినాయకత్వం అందరి ఏకాభ్రియంతో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి గా ఖరారు చేసింది. రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
రేవంత్ రెడ్డి ప్రస్థానం…
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో అనుముల నర్సింహారెడ్డి-రామచంద్రమ్మ లకు జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గ్యాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ లోనే విద్యార్థి సంఘములో పని చేశారు. ఆయనకు వారి కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ క్షేత్రస్థాయి నుండి రాజకీయ నేతగా ఎదిగారు. 2007లో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీగా గెలిచారు. అనంతరం ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో పార్టీల దృష్టి రేవంత్ రెడ్డి పై పడింది. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావాలని ఆహ్వానించినా.. దివంగత సీఎం ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉన్న అభిమానంతో టీడీపీ పార్టీలో చేరారు. టిడిపి పార్టీ నుండి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ అభ్యర్థులు రావులపల్లి గుర్నాథ్ రెడ్డి పై గెలుపొందారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున రెండోసారి బరిలో దిగి ఘన విజయం సాధించారు. 2014 నుండి 2017 వరకు టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ గా పని చేశారు. 2017 అక్టోబర్ లో టిడిపికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయ్యారు. 2018 ఎన్నికల్లో కొడంగల్‌లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయి 2019లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు. నాటి నుండి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విశేష కృషి చేశారు. రేవంత్ రెడ్డి కృషిని గుర్తించి సీఎంగా ప్రకటించింది.