రైతులకు అండగా  ప్రజా ప్రభుత్వం 

1
  • ఆన్​ లైన్​లో ‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి  

హైదరాబాద్:

కరువు వచ్చినా.. ఎంత కష్టం వచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులున్నాయని, కలిసికట్టుగా కరువును ఎదుర్కుందామని సీఎం పిలుపునిచ్చారు.

ఏడాదిగా సరైన వర్షపాతం లేకపోవటంతో రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని, అందుకే అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. రిజర్వాయర్ల నుంచి నీళ్లను విడుదల చేయాలని కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ప్రాంతంలోని రైతులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. రైతులందరూ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎండాకాలంలో తాగునీటి కష్టాలు రాకుండా చూడాల్సిన అవసరముందని, అందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి బుధవారం ఉదయం తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ సెక్రెటరీ, కమిషనర్​ రఘునందనరావు, డైరెక్టర్​ గోపి, రైతు సంఘాల ప్రతినదులు సుంకెట అన్వేష్ రెడ్డి, నల్లమాల వెంకటేశ్వరరావు, వై వెంకటేశ్వరరావు సచివాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి పలువురు రైతులు కాన్ఫరెన్స్ లో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. తాము పండిస్తున్న పంటల ద్వారా లాభాలు సాధిస్తున్న తీరును వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,601 రైతు వేదిక లకు వీడియో కాన్ఫరెన్స్‌ అను సంధానం చేసి నేరుగా రైతుల సమస్యల ను పరిష్కరించేందుకు ప్రభుత్వం వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టింది. తొలి విడతగా ప్రయోగాత్మకంగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను నెలకొల్పింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రూ.97 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టింది. దీంతో రాష్ట్ర అధికారులతో పాటు వ్యవసాయ నిపుణులు నేరుగా గ్రామాల్లో, పంట పొలాల్లో ఉండే రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకుంటుంది.

పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలతో పాటు అధునాతన మెలకువలను ఎప్పటికప్పుడు వారికి అందిస్తుంది. ఆదర్శ రైతుల తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ లో చేపట్టిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కునే సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు వాళ్లకు సలహాలు సూచనలిచ్చేందుకు రైతు నేస్తం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. నేరుగా రైతులు వ్యవసాయ నిపుణులతో మాట్లాడేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లాలని, అందులో భాగంగానే రైతుల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. రైతులతో కలిసి మెలిసి భవిష్యత్ కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. విత్తనాలు, ఎరువులు, ఏ పంట వేయాలనేది మొదలు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేంత వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు.

రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కాకుండా లాభసాటి ధర రావాలనే ఆలోచనతో ప్రభుత్వం కార్యాచరణ చేస్తోందన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతులకు విత్తనాలు అందుబాటులోకి తీసుకురావటం, ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డుల ద్వారా పంట ఉత్పత్తుల కొనుగోలు కార్యక్రమాలన్నీ చేపడుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉందని, కేవలం వరి లేదా పత్తి మిర్చీ పంటలకే పరిమితం కావద్దని రైతులకు సీఎం సూచించారు. ఇతర పంటలు సాగు చేయాలని, పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. తక్కువ నీళ్లతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి, ఎక్కువ లాభాలు వచ్చేలా పంటలను ప్రణాళిక చేసుకోవాలని చెప్పారు.

వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని, దీంతో తమ సమస్యలను సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావచ్చని అన్నారు. ప్రస్తుతం 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తామని చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవలే పంటల భీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిందని గుర్తు చేశారు. రైతులు ఏదైనా ఆపదతో చనిపోతే ఆ కుటుంబాన్ని రైతు బీమా పథకం ఆదుకుంటుందని అన్నారు. రైతులు ధీమాగా బతికేందుకు వీలుగా పంటల బీమా పని చేస్తుందని చెప్పారు.

1 thought on “రైతులకు అండగా  ప్రజా ప్రభుత్వం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *