మేడారం జాతరలో అధికారులు అంకితభావంతో పనిచేయాలి

0
  •  ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్

మేడారం:
మేడారం మహా జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధత, అంకితభావంతో పనిచేసి, మేడారం జాతరను విజయవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్ అన్నారు. సోమవారం ములుగు కేంద్రం లోని లీల గార్డెన్స్ లో జాతర విధులకు కేటాయించబడిన సెక్టోరల్ అధికారులు, సిబ్బందికి మొదటి విడత శిక్షణా కార్యక్రమాన్ని ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ, జాతర విజయవంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, అన్ని వర్గాల వారు సమన్వయంతో మహా జాతరను విజయవంతం చేయాలన్నారు.

జంపన్నవాగు వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏ మాత్రం విధులలో ఏమరుపాటు గా వ్యవహరించరాదని తెలిపారు. జాతర పరిసరాల్లో భక్తులకు అర్థమయ్యేలా ఆర్ అండ్ బి శాఖవారు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జనసముహం లో పారిశుధ్య నిర్వహణ నిరంతరం 24 గంటలు చేయాలన్నారు. దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు గల్ఫర్ తో శుభ్రం చేస్తుండాలని సూచించారు. జాతర చుట్టూ 5 కి.మీ. పరిధిలో అన్ని ఏర్పాట్లు చేయాలని, పారిశుధ్యాన్ని పకడ్బందీగా చేపట్టాలని పేర్కొన్నారు. పారిశుధ్య సిబ్బందికి యూనిఫాం, గ్లౌజ్ లు, మాస్కులు ఇవ్వాలని స్పష్టం చేశారు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయాలని, ఆరోగ్య పరంగా మందులు అందుబాటులో పెట్టుకొని సర్వ సన్నద్దంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు.

ఆలయ అలంకరణ, లైటింగ్, పరిసరాలు గిరిజన సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం జాతర నిర్వహించాలని వెల్లడించారు. ఇంజనీరింగ్, పారిశుధ్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలన్నారు. శాఖలవారు సెక్టార్లను అంతర్గతంగా విభజించి, సిబ్బందికి షిఫ్టులవారీగా విధులు అప్పజెప్పాలన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని కచ్చితంగా అమలుచేయాలని చెప్పారు. జాతరలో పేపర్, క్లాత్, జూట్ సంచులను వాడాలన్నారు. మహా జాతర ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా జరుపుకోవాలనే సందేశం ప్రతి ఒక్కరికీ తెలియాలి.గద్దెల వద్ద విధులు నిర్వర్తించే వారు సహనం కోల్పోకుండా భక్తులకు సేవాలందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి శ్రీజ మాట్లాడుతూ జాతర నిర్వహణ ప్రతిసారి ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని, గతం కంటే మెరుగైన సేవలు అందించాలని, సెక్టార్ అధికారులది జాతర నిర్వహణలో కీలకమైన పాత్ర అని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి సెక్టార్ లో త్రాగునీరు, టాయిలెట్లు తదితర కనీస సౌకర్యాలు వుండేలా, సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు, సిబ్బంది తమ తమ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ ) వేణు గోపాల్ , సెక్టోరల్ అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *