కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను సింగిల్‌గానే ఎదుర్కొంటాం

0
  • ఎన్నికల హామీలపై కాంగ్రెస్ అప్పుడే చేతులెత్తేసిందని విమర్శ
  •  రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకు జనం సిద్ధంగా లేరు
  •  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
  • రెండోరోజు మూడు మండలాల్లోని గ్రామాల్లో ప్రజాహిత యాత్ర పూర్తి

కరీంనగర్:
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఛీ కొట్టిన బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఖర్మ బీజేపీకి పట్టలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని తేలడంతో పాటు తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు వస్తున్నాయని..తేలడంతో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ..కేసీఆర్ కొన్ని సర్వే సంస్థల ద్వారా సంకేతాలు పంపుతూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. తద్వారా ప్రజల్లో గందరగోళం స్రుష్టించేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని మండిపడ్డారు.

ప్రతీ సారి ఎన్నికలు రాగానే ప్రజలను నమ్మించి మోసం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నిస్సిగ్గుగా లోపాయికారీగా కలిసే పనిచేస్తున్నయని ఆరోపించారు. గత ఎన్నికల్లోనూ బీజేపీని దెబ్బతీసేందుకు అట్లాంటి దుష్ప్రచారమే చేశాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎప్పటి నుండో కలిసే పనిచేస్తున్నయని, పార్లమెంట్ లోపల, బయటా ఆ రెండు పార్టీలు బహిరంగంగానే కలిసే పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని కలిసే ఓడించేందుకు కుట్ర చేశాయన్నారు.

ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, రుద్రంగి, చందుర్తి మండలాల్లో బండి సంజయ్ పాదయాత్ర చేశారు. సాయంత్రం చందుర్తి మండలంలోని కట్టలింగంపేటలో గడప గడపకు పాదయాత్ర చేశారు. కేంద్ర పథకాలను వివరించారు. గ్రామాల వారీగా కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను వెల్లడించారు. స్థానికంగా ఉన్న రేషన్ షాపును సందర్శించారు. రేషన్ బియ్యం కేంద్రమే ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందిస్తోందని చెప్పారు. అందుకోసం కిలో బియ్యానికి రూ.29లు కేంద్రం చెల్లిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి మాత్రమే ఇస్తోందని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ప్రచారాన్ని విలేకరులు ప్రశ్నించగా తీవ్రంగా స్పందిస్తూ ఆ రెండు పార్టీలపై నిప్పులు చెరిగారు.

కేసీఆర్ ఫాంహౌజ్ లో తుంటి విరగ్గొట్టుకుని చికిత్స తీసుకుంటున్నారనే జాలి ఉండేదని కానీ, అక్కడి నుండే మళ్లీ బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయనే సంకేతాలను పంపుతూ ప్రజలను గందరగోళపర్చాలని చూస్తున్నడని తెలిపారు. మొన్ననే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ఛీ అని థూ కొట్టారని గుర్తుచేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మూడో స్థానం రాబోతోందని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. బీజేపీకి అత్యధిక స్థానాలు రాబోతున్నాయని తెలిసి కూడా బీఆర్ఎస్ తో ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? అని అడిగారు. ఆ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఓడిస్తామని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడిందని, ఎన్నికల హామీల పేరుతో మోసం చేసి అధికారం చేపట్టారని అర్థమైందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేరని తేలిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే రూ. 5 లక్షల కోట్లు కావాలి. బడ్జెట్ లో పదో వంతు కూడా కేటాయించలేదని తెలిపారు. ఒక్క మహాలక్ష్మీ పథకం అమలు కావాలంటేనే రూ.50 వేల కోట్లకుపైగా కావాలి. ఎక్కడి నుండి తెస్తారు? కాంగ్రెస్ పార్టీ ముందే చేతులెత్తేసిందని అన్నారు. అట్లాంటి పార్టీని నమ్మి మోసపోయామని ప్రజలు గమనించారని తెలిపారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటేశాం? అనే భావనలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు.

ఈ నెలాఖరు లేదా మార్చి తొలివారంలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడటం ఖాయమని తెలిపారు. రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి ఎన్నికల షెడ్యూల్ పేరుతో దాటవేయడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు.
దేశమంతా మోడీ గాలి వీస్తోందని, దేశ రక్షణకు మోడీ సేవలు అవసరమని ప్రజలు భావిస్తు్న్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా ప్రజలెవరూ ఒప్పుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ను ప్రజలెవరూ పట్టించుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *