కాంగ్రెస్ టికెట్ రేసులో ఇనుగాల పెద్దిరెడ్డి

2

కరీంనగర్:
లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అత్యంత ప్రయారిటీ ఉన్న నియోజకవర్గాల్లో ఒకటైన కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయమై ముఖ్యనాయకులతో పాటు రాష్ట్ర నాయకులు, ఆ పార్టీ అగ్రనాయకత్వం దృష్టి సారిస్తున్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. పలువురి పేర్లు సైతం ప్రచారంలో ఉన్నాయి. కాగా, తాజాగా సరికొత్త పేరు తెరమీదకు వస్తున్నట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి..కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ ఖరారు అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ఇనుగాల పెద్దిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ బీజేపీ తరఫున మరోసారి బరిలో నిలచే అవకాశాలున్నట్లు సమాచారం. ఇప్పటికే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సంగతి అందరికీ విదితమే. బీజేపీ నుంచి బీసీ, బీఆర్ఎస్ నుంచి వెలిమ అభ్యర్థులు బరిలో నిలిస్తే కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు అయి ఉండే అవకాశాలు మెండుగా ఉన్నట్లు రాజకీయ వర్గాల టాక్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు వినికిడి. మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సైతం కాంగ్రెస్ టికెట్ రేసులో ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అటు పార్టీ బలం, ఇటు వ్యక్తిగత ఇమేజ్ రెండూ కలిసొచ్చే విధంగా అభ్యర్థి ఎంపిక ఉండాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ కన్ఫర్మ్ చేస్తే..కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రెడ్డి ప్లస్ ఇతర ఓటు బ్యాంకు సమీకరణాలు కూడా కలిసొచ్చే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోకాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

ఇనుగాల పెద్దిరెడ్డి పూర్వాశ్రమంలో టీడీపీలో ఉన్న సంగతి అందరికీ విదితమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం గతంలో తనతో టీడీపీలో కలిసి పని చేసిన నేతలను కాంగ్రెస్ పార్టీలోకి వెల్ కమ్ చెప్తున్నారు. ఆ దిశలోనే ఇనుగాల పెద్దిరెడ్డి సైతం హస్తం గూటికి చేరుతారని తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కరీంనగర్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు అత్యంత సన్నిహితుల ద్వారా సూచనా ప్రాయంగా ఇనుగాల పెద్దిరెడ్డి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

ఇక ఇనుగాల పెద్దిరెడ్డి రాజకీయ ప్రస్థానం విషయానికొస్తే..1992లో తెలుగుదేశం పార్టీ లో చేరి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొప్పరాజు లక్ష్మీకాంతరావు పై 19,291 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరి సాయిరెడ్డి పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కార్మిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పని చేశాడు. ఇనుగాల పెద్దిరెడ్డి 2004లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పటి బీఆర్ఎస్) అభ్యర్థి కెప్టెన్ వొడితెల లక్ష్మీకాంతరావు చేతిలో ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత క్రమంలో పెద్దిరెడ్డి..2007లో టి.దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీలో చేరారు. అనంతరం ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ(పీఆర్పీ) ‘‘సామాజిక తెలంగాణ’’ నినాదానికి ఆకర్షితులై నవ తెలంగాణ పార్టీని అందులో విలీనం చేశారు. ప్రజారాజ్యం పార్టీలో చేరిన అనంతరం 2009 లో జరిగిన ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనతో హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటి చేసి ఓటమి పాలయ్యాడు. ఆ పార్టీ తీరుపై అసంతృప్తితో తిరిగి తెలుగుదేశం పార్టీ లో చేరి పార్టీ అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. అనంతరం పెద్దిరెడ్డి..2019 జూన్ లో తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికల ముందర 2021, జూలై 26న బీజేపీకి రాజీనామా చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ లో 2021 జూలై 30న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గులాబీ గూటికి చేరారు.

2 thoughts on “కాంగ్రెస్ టికెట్ రేసులో ఇనుగాల పెద్దిరెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *