18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి

0

ఓటర్ జాబితా పకడ్బందీగా రూపొందించాలి
. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

హనుమకొండ :
భారత ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం స్పెషల్ సమ్మరీ రివిజన్ ముసాయిదా ప్రకారం..ఓటర్ల జాబితాను పకడ్బందీగా రూపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు స్పెషల్ సమ్మరీ రివిజన్, ఓటరు నమోదుపై పరకాల నియోజకవర్గ పరిధిలోని పరకాల, సంగెం, దామెర, ఆత్మకూరు, గీసుకొండ, నడికూడ, ఖిలా వరంగల్ మండలాల తహశీల్దార్లతో శుక్రవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ…భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ముసాయిదా షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను పకడ్బందీగా తయారుచేయాలని పేర్కొన్నారు.
జిల్లాలో మొత్తం 5లక్షల 8వేల 124మంది ఓటర్లు ఉన్నారన్నారు. పరకాల నియోజకవర్గంలో 221436 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ ద్వారా ఒకే మాదిరిగా ఉన్న ఓటర్ల ఫోటోలను గుర్తించి తొలగించడం జరుగుతుందని తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తయిన ఓటర్లను గుర్తించి నమోదు చేయాలని, చనిపోయిన ఓటర్లను గుర్తించి ఓటర్ల జాబితా నుండి తొలగించి సమగ్రమైన జాబితా సిద్ధం చేయాలన్నారు.

బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు పూర్తి చేయాలన్నారు. ఫామ్ -6 ద్వారా నూతన ఓటర్లను తప్పని సరిగా నమోదు చేయాలని, ఫామ్ – 6 (బి) ద్వారా ఆధార్ సీడింగ్ చేయాలని తెలిపారు. జనవరి 5వ తేది లోగా ప్రత్యేక అధికారులు, బి.ఎల్. ఓ.లు, సూపర్వైజర్ లు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా ఓటరు జాబితా పూర్తి చేయాలన్నారు. ఓటర్ నమోదు వివరాలను గరుడ యాప్ లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో పరకాల ఆర్డివో శ్రీనివాస్, తహశీల్దార్లు జగన్మోహన్ రెడ్డి, రాజ్ కుమార్, నాగరాజు, జ్యోతి వరలక్ష్మి దేవి, సురేష్ కుమార్, రియాజ్, సుభాషిణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *