అన్ని శాఖలు సమన్వయంతో ఎన్నికలు విజయవంతం

అన్ని శాఖలు సమన్వయంతో ఎన్నికలు విజయవంతం
. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
హనుమకొండ :
జిల్లాలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండ అంబేద్కర్ భవన్ లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంపై ఎలక్షన్ సక్సెస్ మీట్ ను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ…శాసనసభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడి పని చేశారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు రానున్న ఎన్నికలను కూడా విజయవంతం చేసేందుకు సమన్వయంతో అధికారులు సిబ్బంది పని చేయాలని కోరారు. ఎన్నికల విధులలో పాల్గొన్న ప్రతి అధికారి వారికి అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలోని రెండు నియోజకవర్గాలైన పరకాల, వరంగల్ పశ్చిమలో శాసనసభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారులు శ్రీనివాస్, రమేష్ లు ఎంతో కృషి చేశారని, వారికి ఈ సందర్భంగా అభినందనలు అని కలెక్టర్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించిన పోలీసు శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు కూడా ఈ విధంగానే అన్ని శాఖలు సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా విధులు నిర్వర్తించి ఎన్నికల విజయవంతానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా కృషిచేసిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.. మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ముఖ్య పాత్రను పోషించారని, ఎక్కడ కూడా చిన్న సమస్య తలెత్తకుండా సమష్టిగా పనిచేశారని అన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో కృషిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. రాబోయే ఎన్నికలను ఇదేవిధంగా సమస్టిగా కృషిచేసి విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల విజయవంతంగా నిర్వహించడంలో కలెక్టర్ కీలకపాత్రను పోషించారని తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో విజయవంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఎక్కడ కూడా లోటుపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించడంలో వివిధ విభాగాల సమన్వయం ఎంతో ఉందన్నారు. సమష్టి కృషితోనే జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఏ చిన్న సమస్య తలెత్తకుండా విజయవంతంగా పూర్తి చేసుకున్నామన్నారు. మిగతా జిల్లాల కంటే హనుమకొండ జిల్లాలో ఏ చిన్న పొరపాటు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ఇదేవిధంగా విజయవంతంగా పూర్తిచేసేందుకు సన్నద్ధం కావాలన్నారు. పోలీసు, రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులు సిబ్బంది కష్టపడి పనిచేసి ఎన్నికల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి ఎం.ఏ.భారీ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం గౌరవప్రదంగా ఉందన్నారు. అధికారులు సిబ్బంది సమన్వయంతోనే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి శ్రీనివాస్ కుమార్, హనుమకొండ ఏసిపి కిరణ్ కుమార్, డీఈవో అబ్దుల్ హై, స్వీప్ నోడల్ అధికారి హరి ప్రసాద్, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.