మేడారం జాతరలో భక్తులకు ఏ లోటు రావద్దు: మంత్రి సీతక్క

0

మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి
. గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి సీతక్క

హైదరాబాద్:
2024 ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి సీతక్క అన్నారు. శనివారం హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీతక్క ఈ మేరకు ఆదేశాలిచ్చారు. జాతరలో పారిశుధ్యం, రహదారులు, విద్యుత్తు, తాగునీటి లభ్యత, స్నానాల ఏర్పాట్లు, భక్తుల వసతులు తదితర అంశాలవారీగా సంబంధిత అధికారులతో చర్చించి తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇంత క్రితం జాతరకు రెండు నెలల ముందే జరిగిన కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈ సారి జాతర సమయంలోనే జరిగేటట్లు చూడాలని, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపి మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి చేద్దామని, తద్వారా రాష్ట్ర బడ్జెట్ కు కేంద్ర నిధులు తోడై జాతరను మరింత ఘనంగా నిర్వహించవచ్చన్నారు. వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించి జాతర పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ తన తల్లివంటిదని, ఈ శాఖ ఉద్యోగులు తనను సోదరిలా భావించి తమ సమస్యలను ఎప్పుడైనా చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చొంగ్తు, అదనపు సంచాలకులు విట్టా సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శంకర్, ట్రైకార్ జీఎం శంకర్, టీఆర్ఐ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *