గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

0

గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి
. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు
. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
. గంగిపల్లి గ్రామంలో బస్ షెల్టర్లు, ఓపెన్ జిమ్ ప్రారంభించిన మంత్రి
. నిజాయితీ గూడెంలో పంచాయతీ భవన ప్రారంభం

కరీంనగర్:
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తదనుగుణంగానే గ్రామాల నుండి ప్రణాళికలు సిద్ధం కావాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం మానకొండూర్ మండలంలోని గంగిపల్లి, కొండపల్కల, నిజాయితిగూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి ప్రారంభించారు. గంగిపల్లిలో గ్రామ పంచాయతీ నిధుల ద్వారా 6 లక్షల వ్యయంతో నిర్మించిన బస్ షెల్టర్లు, 4 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను, కొండపల్కల గ్రామంలో కరీంనగర్- మానకొండూర్- చెంజర్ల- గంగిపల్లి- కొండపలకల మధ్య నడవనున్న ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. అనంతరం అదే బస్సులో మంత్రి గంగిపల్లి వరకు ప్రయాణించారు. నిజాయితీ గూడెం గ్రామంలో 23 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…రాష్ట్రంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కంకణబద్ధులై ప్రజాపాలన కొనసాగిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 9 మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని గ్రామాల అభివృద్ధికి కంకణ బద్ధులై, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఇప్పటి వరకు 6.50 కోట్ల జీరో టిక్కెట్లు ద్వారా మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణించారన్నారు. అదేవిధంగా నిరాదరణకు గురైన ఆరోగ్యశ్రీ పథకానికి పునరుజ్జీవాన్ని అందిస్తూ 5 లక్షల నుండి 10 లక్షల వరకు వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టామన్నారు. ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలు దూరం చేసేలా డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమం ద్వారా వచ్చిన కోటి 5 లక్షల దరఖాస్తులు 45వేల మంది కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా ఆన్లైన్ లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అతి త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు వారు కోరుకునే పథకాలను వర్తింపచేసే ప్రక్రియను మొదలు పెడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలలో ఇప్పటికే రెండింటిని అమలు చేయడం జరిగిందన్నారు. 100 రోజులలో గృహ జ్యోతి పథకం ద్వారా రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఇళ్లు లేని వారిని గుర్తించి సొంత ఇంటిని అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతు భరోసా, పింఛన్ల మంజూరు, యువ వికాసం మొదలగు పథకాలను ప్రణాళిక ప్రకారం అమలు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్ తరాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే దూరదృష్టితో ఇందిరమ్మ ఇళ్లు, సమస్యలను దూరం చేసేలా ఉపాధిహామి, ఈజీఎస్, వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, కానీ ఆవి నిరాదరణకు గురయ్యాయన్నారు. తిమ్మాపూర్ లోని డ్రైవింగ్ స్కూల్ ట్రాక్ కు చొక్కారావు పేరును మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. అదే విధంగా చొక్కారావు జన్మదినం రోజే కరీంనగర్ జిల్లాలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా చొక్కారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం ఇబ్బందులు తలెత్తిన వాటిని పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేస్తూ వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో ధాన్యం సేకరణలో తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే వారని, భవిష్యత్తులో కొనుగోళ్లలో తరుగు ఉండకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ…డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమం ద్వారా మీసేవ, తహసీల్దార్, ఎంపిడిఓ కార్యాలయాలు, దళారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, మానకొండూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ముద్దసాని సులోచన, ఎంపిటిసిలు రంగు భాస్కరాచారి, చలిగంటి సంపత్, ఎంపీపీ సులోచన, సర్పంచ్లు మాసం శాలిని, బోళ్ల మురళీధర్, ఉప సర్పంచ్లు తాళ్లపల్లి సంపత్, ఊరడి కొమురయ్య, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎమ్ భూపతి రెడ్డి, డిఆర్డివో శ్రీలత, జడ్పీ సీఈఓ పవన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, పంచాయతీ ఫోరం అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *