రుణ లక్ష్యాలను పూర్తి చేయాలి

0

ఆర్థిక మద్దతు పథకాల లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్:
జిల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యసాధనకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకర్లను కోరారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎం జి.పి.వై. రుణాలు, ఎస్సీ, బిసి, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి ఋణ లక్ష్య పురోగతి పై డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ ఆర్థిక మద్దతు పథకాలకు సంబంధించి వంద శాతం లక్ష్యసాధనకు బ్యాంకర్లు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశం పై వారికి అవగాహన కల్పించాలని, జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను పంట రుణాలకు జమ చేసుకోవడానికి వీలు లేదని, సదరు నియమాలను బ్యాంకర్లు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెల వరకు రూ.5648.12 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు గాను రూ. 2233.69 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగంలో రూ.1212.49 కోట్లు, విద్యా రుణాలకు రూ.8.78 కోట్లు, హౌసింగ్ లోన్స్ రూ.145.96 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ.386.69 కోట్లు మరియు ఇతర రంగాలకు సంబంధించి రూ.1660.51 కోట్లు రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులు అందరికీ రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న లక్ష్యాల్లో 75.49 శాతం పూర్తయిందని, పెండింగ్ లో ఉన్న రుణాల ప్రతిపాదనలు సైతం బ్యాంకర్లకు అందించి త్వరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ పథకాలలో రుణాలు మంజూరి అయిన లబ్ధిదారులు, స్వయం సహాయక సంఘాలు తిరిగి సకాలంలో బ్యాంకులకు చెల్లించేలా ఆయా శాఖల అధికారులు జిల్లాలో రుణాల రికవరీ పై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. యువతకు ఉపాధి అందించే విషయంలో అధికారులు చొరవ చూపాలన్నారు. జిల్లాలో ప్రధానమంత్రి స్వనిధి కింద మొదటి, రెండవ, మూడవసారి రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. విశ్వభారత్ సంకల్ప యాత్ర (విబిఎస్ వై)లో భాగంగా కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో అన్ని బ్యాంకు శాఖలు ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రొగ్రామ్ (పీఎంఈజీపీ), ప్రధానమంత్రి జీవనజ్యోతి (పిఎంజిజిబివై), ప్రధాన్‌ మంత్రి సురక్ష బీమా యోజన (పియంఎస్ బివై), అటల్ పెన్షన్ యోజన (ఎపివై), పియం స్వనిధి, (PMSVANIDHI), ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ స్కీమ్ (పియంఎఫ్ఎంఈ), విశ్వకర్మ యోజన మొదలగు పథకాలపై అవగాహన సమావేశాలను నిర్వహించాలన్నారు. అర్హులైన వ్యక్తులను పథకాలలో నమోదు చేయలని బ్యాంకర్లను కోరారు. అనంతరం నాబార్డ్ కు సంబంధించిన 2024-25 జిల్లా ప్రొటేన్షియల్ లింక్డ్ ప్లాన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, జియం ఇండస్ట్రీ నవీన్, డిఆర్డివో శ్రీలత, ఎల్డియం ఆంజనేయులు, ఆర్బిఐ అధికారి సాయితేజ, ఎజియం నాబార్డ్ ప్రకాశ్, ఎస్బిఐ ఎజియం రవి శంకర్, యూబిఐ సియం కలీమ్, టిజిబి ఎజియం ప్రభుదాస్, కెడిసిసి సిఈఓ సత్యనారాయణ, అన్ని బ్యాంకుల కంట్రోలర్ లు, స్థానిక బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *