ప్రశ్నించే గొంతులు నొక్కుతున్న బిజెపి…

0

పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీజేపీనే తరిమి కొడతారు
. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
. పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్ పై సిపిఐ, సిపిఎం నిరసన

హనుమకొండ:
రానున్న పార్లమెంటు ఎన్నికలలో దేశ ప్రజలు బీజేపీనే తరిమి కొడతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల పార్లమెంటులో సమస్యల పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విపక్ష పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఇండియా కూటమి పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతో ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కల్గించడమేనని అన్నారు. ప్రజా వ్యతిరేక తమ అనుకూల విధానాలను అమలు చేసుకునేందుకే విపక్ష పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేశారని విమర్శించారు. విపక్షాలను పార్లమెంటు నుండి సస్పెండ్ చేసిన బీజేపీని 2024 ఎన్నికలలో ప్రజలే సస్పెండ్ చేయడం ఖాయమని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి అంబానీ, ఆదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేశారన్నారు. పెట్టుబడిదారులకు వేల కోట్ల రాయితీలు ఇస్తూ పేదలపై పెను భారాన్ని మోపేలా పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచారన్నారు. రానున్న ఎన్నికలలో ఇండియా కూటమిని బలపరచి ప్రజా సంక్షేమాన్ని మరిచి కార్పొరేట్ జపం చేస్తున్న బీజేపీని గద్దెదించాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, సిపిఎం జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి అద్యక్షత వహించగా కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మండ సదాలక్ష్మి, ఆదరి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు కర్రె లక్ష్మణ్, డాక్టర్ పల్లేరు వీరస్వామి, మునిగాల బిక్షపతి, కొట్టెపాక రవి,మాలోతు శంకర్, బాషబోయిన సంతోష్, కామెర వెంకట రమణ,రాసమల్ల దీనా సిపిఎం జిల్లా నాయకులు సారంపల్లి వాసుదేవ రెడ్డి, వీరన్న, గొడుగు వెంకట్, మంద సంపత్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *