మీ తరపున కొట్లాడిందెవరో…. అవినీతిపరులెవరో ఆలోచించండి

. ఓటమి ఖాయమని తేలడంతో నాపై దొంగ వీడియోలు సృష్టించే కుట్ర
. మీ తరపున కొట్లాడిందెవరో…. అవినీతిపరులెవరో ఆలోచించండి
. ప్రజలు విజ్ఞతతో ఓటేయండి
. కరీంనగర్ ప్రజలకు బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ పిలుపు

కరీంనగర్:
కరీంనగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులిద్దరూ భూకబ్జాదారులేనని.. వీళ్లద్దరూ నయీం బ్రదర్స్ అని కనబడ్డ భూములను కబ్జా చేయడమే వీళ్లపని అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. వాళ్ల మాదిరిగా భూకబ్జాలు చేయలేదని, అవినీతికి పాల్పడలేదన్నారు. ప్రజల కోసమే పోరాడిన చరిత్ర తనదన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం లేదని సర్వేలు తేల్చడంతో… నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు మార్ఫింగ్ లు చేసి దొంగ వీడియో, ఆడియోలు స్రుష్టించి ప్రజలను గందరగోళంలో పడేసే పెద్ద కుట్రకు తెరదీశారని చెప్పారు. కరీంనగర్ ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని కరీంనగర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కమాన్ చౌరస్తాలో ప్రచారం నిర్వహించారు. బండి సంజయ్ రాకతో విపరీతంగా జనం తరలివచ్చారు. మహిళలు, యువకులు ఘన స్వాగతం పలికారు. గంగుల 3సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని, ఎవరికైనా ఇండ్లు ఇచ్చారా? మోదీ ప్రభుత్వం తెలంగాణకు 2.4 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్, గంగుల ఆ నిధులన్నీ దారి మళ్లించారే తప్ప పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. మంత్రిగా ఉంటూ ఒక్కరికైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగమిచ్చారా? ఒక్కరికైనా నిరుద్యోగ భ్రతి ఇచ్చారా? సమాధానం చెప్పాలన్నారు. మోదీ ప్రభుత్వం 6 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలివ్వడం తోపాటు ఏ ఒక్క అవినీతి ఆరోపణలకు తావివ్వకుండా పరీక్షలన్నీ సజావుగా జరపడంతోపాటు నియామక పత్రాలు అందజేసిన ఘనత మోడిదే అన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల ఉసురు పోసుకుందని, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగులను రోడ్డున పడేశారన్నారు.
స్మార్ట్ సిటీకి 9 వేల కోట్లు నిధులు తెచ్చా…
ఎంపీగా ఉంటూ బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశాడని చెబుతున్న గంగులకు తెల్వదా?..9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చానని? స్మార్ట్ సిటీ నిధులను కొట్లాడి నేను తీసుకొస్తే కొబ్బరికాయ తానే తెచ్చినట్లు ఫోజులు కొట్టిందెవరు? తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణానికి నిధులు తెచ్చిందెవరు? కరీంనగర్..వరంగల్, కరీంనగర్…జగిత్యాల రోడ్డు నిర్మాణ నిధులు నేనే తీసుకొచ్చిన. జిల్లా ఆసుపత్రి అభివ్రుద్ధికి నిధులు నేనే తీసుకొచ్చిన… అయినా తానే చేశానంటూ గంగుల చెప్పడం సిగ్గు చేటు.. దమ్ముంటే అభివృద్ధి, నిధులపై చర్చకు రావాలని గంగులకు సవాల్ విసిరారు.