ఇంటికో ఉద్యోగం హామీ ఏమాయే : కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్

బిజెపి, బిఆర్ఎస్ దొందు దొందే…
. ఇంటికో ఉద్యోగం హామీ ఏమాయే... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్
. ఆదరించి ఆశీర్వదించండి
. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్

జమ్మికుంట:
బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి హామీలు ఇచ్చి ఓట్లు దండుకునేందుకు చూస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం జమ్మికుంటలో జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభలో ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇంటికో ఉద్యోగం ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగాల వస్తాయనే ఆశతో లక్షల రూపాయలు కోచింగ్లకు ఖర్చుపెట్టి చేసిన అప్పులు తీర్చలేక నిరుద్యోగ విద్యార్థి యువకులు కూలీలుగా మారారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తీరుతో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని, బిజెపి కి ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టే బిఆర్ఎస్ కు వేస్తే బిజెపికి వేసినట్టేనన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా…మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా.. ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని ఎల్లవేళలా అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.