అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం:వొడితల ప్రణవ్

హుజురాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం..
. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
. మోసపూరిత పార్టీల మాటలు నమ్మొద్దు
. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్

హుజురాబాద్ :
అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని దేశంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా పలు వీధుల్లో మాస్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 24 గంటల ఉచిత విద్యుత్తు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ యేనని అన్నారు. రైతులెవ్వరు మోసపూరిత మాటలు నమ్మవద్దని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులకు హామీలను అమలు చేస్తామన్నారు. బిఆర్ఎస్, బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ హామీల పై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ చేసి పింఛన్లు పెంచేస్తామని బిఆర్ఎస్ చెప్తుందని, ఉన్న పింఛన్లు సమయానికి ఇవ్వడం లేదు కానీ కొత్త పింఛన్లు ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాత, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియమ్మ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. వేయికోట్ల నిధులతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటలు చెబుతున్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎవరు ఆపారని అడిగారు. మండలానికో ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాల ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యానందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రెండు దశాబ్దాలుగా ప్రజలు ఈటల రాజేందర్ ను గెలిపిస్తూ వస్తున్నారని, ఈ నియోజకవర్గ ప్రజలను కాదని గజ్వేల్లో పోటీ చేస్తున్నారన్నారు. గజ్వేల్ కు వెళ్లి గజ్వేల్ ముద్దుబిడ్డనని, హుజురాబాద్ కు వచ్చి హుజురాబాద్ బిడ్డనని చెప్తున్నాడన్నారు. ఏడుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు గడుస్తున్న హుజురాబాద్ కు ఏం చేయలేదన్నారు. కనీసం తన సొంత మండలంలోని ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని సైతం పూర్తి చేయలేని పరిస్థితిలో ఈటల రాజేందర్ ఉన్నారన్నారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనన్నారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత, మండల పార్టీ అధ్యక్షురాలు లావణ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.