వేములవాడను కాశీ తరహాలో అభివృద్ధి చేస్తా..

ప్రపంచమే అబ్బురపడేలా….కాశీ తరహాలో ఎములాడను అభివృద్ధి చేస్తాం..
. ప్రధానిని ఎములాడకు తీసుకొచ్చి ప్రత్యేక నిధులు తీసుకొస్తాం..
. ఎములాడకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు
. రూ.400 కోట్లు ఇస్తానని మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దే
ఎములాడ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?

ఎన్ టి బి న్యూస్, వేములవాడ:
రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే ప్రపంచమే అబ్బురపడేలా వేములాడను కాశీ తరహాలో అభివృద్ధి చేస్తామని బిజెపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం వేములవాడలో బీజేపీ అభ్యర్ధి వికాస్ రావు వేలాది మందితో కలసి భారీ రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. బండి సంజయ్ కి ప్రజలు కనీవినీ ఎరగని రీతిలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కేటీఆర్ నాస్తికుడని విమర్శించారు. వేములవాడను అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో డాక్టర్ చెన్నమనేని వికాస్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారే తప్ప కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదిరిగా దోచుకోవాలనే ఆలోచన లేదన్నారు. రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వేములవాడ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ఎంపీగా ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తెచ్చానన్నారు. ఈ నియోజకవర్గానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరెక్కువ నిధులు ఖర్చు చేశారో చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. నేను అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే కేసీఆర్ మాత్రం బాబ్రీమసీదు కూల్చివేత గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోందని, ఉప ఎన్నికల పలితాలే నిదర్శనమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓట్ల కోసం ఎంఐఎం వద్ద మోకరిల్లుతున్నారని ఆరోపించారు. అప్పులపాలైన రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎట్లా గట్టెక్కిస్తాయో చెప్పాలన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉన్నందున డబుల్ ఇంజిన్ సర్కార్ తో తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

వేములవాడను కాశి తరహాలో అభివృద్ధి చేస్తా..
ఎములాడ రాజరాజేశ్వర ఆలయాన్ని కాశీ మాదిరిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వికాస్ రావును గెలిపిస్తే వారణాసి మాదిరిగా ఎములాడను సమగ్ర అభివృద్ధి చేసి ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఎములాడ దేవస్థాన అభివృద్ధికి 400 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దే అన్నారు. ఆలయ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను సాగనంపాలన్నారు. వికాస్ రావును గెలిపించి డిసెంబర్ 3న స్వామివారి సన్నిధానం వద్ద సంబురాలు చేసుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.