ఆదరణ ఓర్వలేకనే బిజెపి అసత్యపు ఆరోపణలు

0

మార్పు కోరుతున్న ప్రజలు…
.కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు ప్రయోజనం
.ఆదరణ ఓర్వలేకనే బిజెపి నాయకులు అసత్యపు ఆరోపణలు
.అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం
.హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్
.కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

హుజూరాబాద్ :
రాష్ట్రంలో ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని అందుకే ప్రజలంతా కాంగ్రెస్ వెంటే ఉన్నారని ఆ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం హుజరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు వంద శాతం కట్టుబడి పని చేస్తుందన్నారు.

కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ ఓర్వలేకనే అసత్యపు ఆరోపణలు..
కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ ఓర్వలేకనే బిజెపి నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో సానుభూతి పనిచేయదని, బిజెపికి ప్రజలు ఓటేసే పరిస్థితి లేదని తెలిసే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈటల రాజేందర్ హుజరాబాద్ లో ఉంటాడా.. గజ్వేల్ లో ఉంటాడా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పార్టీలు మారే చరిత్ర మా కుటుంబానికే లేదన్నారు. హుజురాబాద్ లో పార్టీలు మారిన నాయకులు ఎవరో ప్రజలకే తెలుసన్నారు.

అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు..
అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ. 2500, రూ.500 గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా కింద రైతులు కౌలు రైతులకు 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12వేలు, వరి పంటకు 500 బోనస్ అందుతుందన్నారు. గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు రూ.5లక్షలు, ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం ఇస్తుందన్నారు. యువ వికాసం కింద విద్యార్ధులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్, చేయూత కింద వృద్ధులకు, వికలాంగులకు 4వేల పెన్షన్ 10 లక్షల ఆరోగ్య శ్రీ బీమా కల్పిస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సొంత ఖర్చులతో ప్రతి మండలానికి స్టడీ సెంటర్, గ్రంధాలయాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు, యువకులు, ఓటర్లు ఆలోచించి మీ బిడ్డగా నిండు మనసుతో ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *