కరీంనగర్ ఐటీ టవర్ లో తొండలు గుడ్లు పెడుతున్నాయ్:బండి సంజయ్

రైతులారా…ఎకరానికి మోదీ చేసే సాయం రూ.24 వేలు
. కేసీఆర్ చేసే సాయం రూ.10 వేలు మాత్రమే
. రైతు పక్షపాతి ఎవరో మీరే ఆలోచించి ఓటేయండి
. బీజేపీ అధికారంలోకి వస్తే… వరి కనీస మద్దతు ధర రూ.3100 చేస్తాం..
. ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం..
. కరీంనగర్ ఐటీ టవర్ లో తొండలు గుడ్లు పెడుతున్నాయ్
. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులది భూకబ్జాల చరిత్ర…
. నాది ప్రజల పక్షాన పోరాటాల చరిత్ర
. కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్

కరీంనగర్:
రైతన్నలారా…మోదీ ప్రభుత్వం యూరియా పేరుతో రెండు పంటలకు కలిసి ఏటా రూ.12 వేలతో పాటు డీఏపీ, ఇతర ఎరువుల సబ్సిడీ పేరుతో ఎకరానికి రూ.18 వేలు చెల్లిస్తోందని కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని కొత్తపల్లిలో వాడవాడలా ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి పూలు చల్లి నీరాజనం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఎకరాకు రూ. 6 వేలు బ్యాంకులో జమ చేస్తోందన్నారు. ఈ లెక్కన రైతులకు మోదీ ప్రభుత్వం రూ.24 వేలు సాయం చేస్తుంటే… కేసీఆర్ ప్రభుత్వం అన్ని సబ్సిడీలు బంద్ పెట్టి రైతు బంధు పేరుతో రూ.10 వేలు మాత్రమే సాయం చేస్తోందన్నారు. మరి ఎవరు గొప్ప? ఆలోచించాలని కోరారు. దీంతోపాటు బీజేపీ అధికారంలోకి వస్తే వరికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 3100లు చెల్లిస్తామని ప్రకటించారు. అట్లాగే మహిళలకు కట్టెల పొయ్యి బాధలు తప్పించేందుకు ఉచితంగా ఉజ్వల సిలిండర్లు ఇచ్చామని చెప్పిన బండి సంజయ్ కుమార్ బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా ఉచితంగా 4 సిలిండర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఐటీ టవర్ లో తొండలు గుడ్లు పెడుతున్నయ్…
గంగుల కరీంనగర్ లో ఐటీ టవర్ ను ప్రారంభించి పెద్దగా ప్రచారం చేసుకున్నడని, తీరా చూస్తే ఒక్కరికి ఉద్యోగం రాలేదన్నారు. ఒక్క కొత్త ఐటీ కంపెనీ కరీంనగర్ కు రాలేదని, అక్కడికి పోయి చూస్తే ఐటీ టవర్ లో తొండలు గుడ్లు పెడుతున్నయ్… ఒక్క కొత్త కంపెనీ తీసుకొచ్చి యువకులకు ఉద్యోగాలివ్వలేని దద్దమ్మ గంగుల కమలాకర్ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. యాదవులకు గొర్లు ఇస్తామని ఒక్కొక్కరి దగ్గర రూ. 46 వేలు డిపాజిట్ చేయించుకుని గొర్లు ఇవ్వకుండా మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ నేతలదన్నారు. చేనేత బంధు ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చిన మోసం చేసిన దుర్మార్గుడు గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఒక్కొక్కరి సంగతి తేలుస్తానని అన్నారు.
ఆలోచించి ఓటేయండి..
బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధుల చరిత్రను ఒక్కసారి బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులది భూకబ్జాల చరిత్ర, వాళ్లపై ఉన్న కేసులన్నీ కబ్జాలు, ఫోర్జరీలు, అక్రమ సంపాదన, ఐటీ కేసులేనని ఆరోపించారు. ఎన్నికలైపోగానే వాళ్లద్దరూ ఒక్కటై రాజీ చేసుకుంటారన్నారు. నేను ప్రజల కోసం పోరాడితే నాపై 74 కేసులు పెట్టారని, ఏ ప్రభుత్వం ఉన్నా…ఆ కేసులపై కోర్టుల్లో నేను కొట్లాడాల్సిందే… మరి ఎవరి కోసం నేను అన్ని కేసులు భరిస్తున్నానో ఒక్కసారి ఆలోచించి ఓటేయాలని కోరుతున్నానన్నారు. నేను ప్రజల తరపున ప్రశ్నిస్తుంటే నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో లేకుండా అవినీతి ఎట్లా సాధ్యం? నేను అక్రమ ఆస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తే అవన్నీ ప్రజలకు రాసిస్తా… ప్రవాస భారతీయులారా… మీ పక్షాన పోరాడుతున్నదెవరో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.