ఆలోచించి ఓటేయండి..అంతిమ నిర్ణయం మీదే.. బండి సంజయ్

కబ్జా కోర్లు కావాలో… ప్రశ్నించే గొంతుక కావాలో ఆలోచించండి
. అంతిమ నిర్ణయం మీదే…
. ప్రజల సమస్యలపై పోరాడి జైలుకు పోయిన చరిత్ర నాది..
. బ్రాహ్మణ, రెడ్డి, ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్

కరీంనగర్:
కరీంనగర్ ప్రమాదంలో పడిందని, భూకబ్జాదారులు, చీటర్లు, అవినీతి కేసులున్న వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్షాన పోటీ చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం శుభమంగళ గార్డెన్స్ లో బ్రాహ్మణ సంఘీభావ, తరువాత బృందావన్ గార్డెన్స్ లో రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి, అనంతరం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను ధర్మం కోసం పోరాడుతున్న, ప్రజా సమస్యలపై పోరాడుతున్న…. ఎటువైపు ఉంటారో ఆలోచించాలని, అంతిమ నిర్ణయం మీదే అంటూ ప్రజలను కోరారు. మీరు ఒక్కసారి ఆలోచించండి.

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధికి నియోజకవర్గం గురించి ఏమీ తెల్వదని, పేదలకు ఏం చేయాలో, కరీంనగర్ ను ఎలా అభివృద్ధి చేయాలో తెల్వదన్నారు. తెలిసిందల్లా భూకబ్జాలు చేయడమేనని ఆరోపించారు. గంగుల పైన కూడా అవినీతి, అక్రమ ఆదాయ కేసులే ఉన్నయన్నారు. పేదల సమస్యలపైన, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం కొట్లాడితే కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ 74 కేసులన్నారు. ఎంపీగా పార్లమెంట్ నియోజకవర్గానికి దాదాపు రూ.9 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చి, కరీంనగర్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారి నిర్మాణం కోసం నిధులు తెచ్చినన్నారు. స్మార్ట్ సిటీకి నిధులు తెచ్చానని తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనన్నారు. తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2 లక్షల 40 వేల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదన్నారు. ఆ ఇండ్లన్నీ పేదలకు కట్టిస్తే… నేను ప్రధానితో మాట్లాడి తెలంగాణకు మరో 5 లక్షల ఇండ్లు మంజూరు చేయించుకొస్తా… సహకరించాలని చెబితే కేసీఆర్ వినలేదన్నారు. కేసీఆర్ 100 రూములతో ప్రగతి భవన్ కట్టుకుని హాయిగా ఉన్నాడని, మరి పేదలు ఏం పాపం చేశారని, వాళ్లకు ఇండ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇంకోవైపు బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవొద్దని కేసీఆర్ అంటున్నడన్నారు. భూకబ్జాదారులు కావాలా? ధర్మం కోసం, ప్రజల కోసం కొట్లాడి జైలుకు పోయిన నాకు ఓటేస్తారా? అంతిమ నిర్ణయం మీదే అని ప్రజలను కోరారు. ప్రజల కోసం పోరాడే నాలాంటి వాళ్లకు ఓటేయకుంటే భవిష్యత్తులో పోరాటాలు చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కరువయ్యే ప్రమాదముందన్నారు. అందుకే ఆలోచించి ఓటేసి ధర్మాన్ని గెలిపించాలని, ప్రశ్నించే గొంతుకను కాపాడాలని కోరారు.