హుజరాబాద్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే…

 

హుజరాబాద్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే…
. రాజకీయంగా ఎదుర్కోలేక ఐటీ దాడులు
. ఏపీ ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు
. ఈ నెల 23న జమ్మికుంటలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభ
హుజురాబాద్:
హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్ దీమా వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలంతా కాంగ్రెస్ పాలన రావాలని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందనే భయంతో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేకనే బిజెపి ప్రభుత్వం నాయకుల ఇళ్లపై ఐటి దాడులను చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కాములు, డ్యాముల పేరుతో ప్రజలను మోసం చేశాయన్నారు. నిరుద్యోగులను, యువకులను, కార్మికులను నిలువునా ముంచాయని ఆరోపించారు. మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవాలనే ఆలోచనలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయన్నారు. వారి మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా హుజురాబాద్ ప్రజలు ఈటలను ఆదరిస్తే ఇక్కడి ప్రజలకు మొండి చేయి చూపి ఈటల గజ్వేల్ కి వెళ్లాడని విమర్శించారు. హుజరాబాద్ లో వొడితల ప్రణవ్ గెలవబోతున్నాడని ప్రజలే చెబుతున్నారన్నారు. ఈ నెల 23న జమ్మికుంటలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు ఈ సభకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. సభకు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, మేధావులు, నిరుద్యోగులు, యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

బిజెపి, బీఆర్ఎస్ లకు ప్రజలే బుద్ధి చెప్తారు…
మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్న బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్ అన్నారు. హుజురాబాద్ లో గత ఏడుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ అనేకమంది పై అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందుల గురి చేశాడని మండిపడ్డారు. నియోజకవర్గం లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఈటల రాజేందర్ అనగాదొక్కాడని ఆరోపించారు. ఈటల హుజురాబాద్ లో ఉంటాడా.. గజ్వేల్ లో ఉంటాడా.. ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, మహిళా అధ్యక్షురాలు పుష్పలత నాయకులు తదితరులు పాల్గొన్నారు.