మీసేవకే నా జీవితం అంకితం..

నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సంక్షేమ అభివృద్ధి, ఫలాలు
– టూరిస్ట్ నాయకుల మాటలు నమ్మకండి..
– మీసేవకే నా జీవితం అంకితం..
– ఆదరించి ఆశీర్వదించండి
– హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్

హుస్నాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గం లో ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి, ఫలాలు అందాయని ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించాలని హుస్నాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీష్ కుమార్ కోరారు. ఆదివారం కోహెడ మండలంలో సముద్రాల, నాగ సముద్రాల, బత్తులవానిపల్లి, బస్వాపూర్, ఆరేపల్లి, పోరెడ్డి పల్లె, గుండారెడ్డి పల్లె గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు సతీష్ కుమార్ కు బ్రహ్మరథం పడుతూ, మంగళహారతులతో, బతుకమ్మలు, బోనాలతో, డప్పుచప్పులతో, కోలాటాలతో స్వాగతం పలికారు. పూల మాలలు వేసి, శాలువాతో సన్మానించి అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ… కోహెడ మండలం మోయతుమ్మెద వాగుపై పోరెడ్డిపల్లి, ఆరపల్లి, కూరెళ్ళ, తంగళ్ళపల్లి, వింజపల్లి, వరికోలు, విజయనగర్ కాలనీ, నకిరెకొమ్ముల గ్రామాలలో 8 చెక్ డ్యాములు 61 కోట్ల వ్యయంతో నిర్మించుకున్నామని తెలిపారు. వాటి నిర్మాణంవల్ల, భూగర్భ జలాలు పెరిగి మండలంలో వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పుష్కలంగా పంటలు పండుతున్నాయన్నారు.

కోనసీమగా కోహెడ…
కోహెడ మండలం మరో కోనసీమను తలపిస్తుందని సతీష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ అలాగే బిజెపి పార్టీలు అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదని, వాగుల్లో నీళ్లు సముద్రంలో వృధాగా కలిసిపోయేవి, చెరువుల మరమ్మత్తులు లేక చుక్క నీరు లేక బావుల్లో నీరు ఉండేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన చోట ఆనకట్టలు కట్టి నీటిని నిలువ చేసుకున్నామని, కేసిఆర్ కాళేశ్వరం, రంగన్నసాగర్, మల్లన్న సాగర్, పాలమూరు ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులను కట్టి వృధాగా పోయే నీటిని పంట పొలాలకు మళ్ళించాడన్నారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గానికి తలమానికమైన 1,06,000 ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తరమైన గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మించామని, పర్యావరణ పరిరక్షణ కేసు విచారణ పూర్తయి ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. గోదావరి నీళ్లను హుస్నాబాద్ గడ్డపై పోయిస్తానని సతీష్ కుమార్ హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై ప్రతిపక్ష పార్టీలకు అవగాహన లేదని, అధికారమే పరమావధిగా వారు పనిచేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో మన దుస్థితిని చూసి కేసిఆర్ ప్రాణాలకు తెగించి, కొట్లాడి తెలంగాణ తెచ్చాడన్నారు. వేలమంది బలిదానాలు చేసుకున్నారని, పది సంవత్సరాల నుండి తెలంగాణలో అభివృద్ధి కళ్ళకు కనపడుతుందన్నారు. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నామని మూడవసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగుతుందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, 24 గంటల కరెంటు, ప్రతి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు, పంటలకు గిట్టుబాటు ధర అందిస్తున్నామన్నారు. 2023 బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కేసిఆర్ ప్రకటించారని ఇప్పటికే తలసరి ఆదాయంలో, ప్రజా సంక్షేమ పాలనలో దేశానికే ఆదర్శంగా ఉన్నామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల కల్లబొల్లి, మాటలకు వారి కుట్రలకు బలి కావద్దని ప్రజలను వేడుకుంటున్నారు. ఈ నెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ, హుస్నాబాద్ ఎమ్మెల్యేగా మూడవసారి భారీ మెజారిటీతో గెలిపించాలని అక్కలకు,అన్నలకు, తమ్ముళ్లకు, యువకులకు పేరుపేరునా సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.

సతీషన్నను ఆశీర్వదించండి…
– బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీష్ కుమార్ సోదరి స్వాతి ప్రచారం
హుస్నాబాద్ ఎమ్మెల్యేగా వొడితల సతీష్ కుమార్ ను మరోసారి ఆశీర్వదించాలని అయన సోదరి వొడితల స్వాతి అన్నారు. ఆదివారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం రేకొండలో ఆమె ఎంపిపి కొత్త వినీత, పెద్ది విజయలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తన అన్న సతీష్ కుమార్ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. సి ఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, అభివృద్ధి ఇలాగె కొనసాగాలంటే.. కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో ఆయా గ్రామాల బీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.