ఎన్నికల్లో కష్టపడ్డ వారికే ‘స్థానిక’ టిక్కెట్లు..

0

ఎన్నికల్లో కష్టపడ్డ వారికే ‘స్థానిక’ టిక్కెట్లు..
. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో బీజేపీని గెలిపించండి
. తప్పుడు ప్రచారాలు నమ్మకండి
. అతి త్వరలో 20 వేల మందితో క్షేత్రస్థాయి కార్యకర్తల సమ్మేళనం
. బీఆర్ఎస్ ను కూకటి వేళ్లతో పెకిలిద్దాం..
. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

కరీంనగర్:
వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎంపీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేయడంతో పాటు గ్రామ, మండల స్థాయిలో వచ్చే ఫలితాల ఆధారంగా కార్యకర్తలు, నాయకులకు స్థానిక సంస్థల్లో బీజేపీ టిక్కెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ లోని శుభ మంగళ గార్డెన్స్ లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మండలాధ్యక్షులు, ఇంఛార్జీల సమావేశానికి బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, కార్యదర్శి బొమ్మ జయశ్రీ, అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు జి.క్రిష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ, ఇంఛార్జీలు మీసాల చంద్రయ్య, మోహన్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి ఇంత క్యాడర్ లేక పోయిన 90 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీని గెలిపించారన్నారు. ఈసారి క్యాడర్ పెరిగిందని, రెట్టింపు మెజారిటీతో పార్టీ అభ్యర్ధిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎన్నికల్లో మండలాధ్యక్షులు, ఇంఛార్జీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్నికల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసే వాళ్లకు, మెరుగైన ఫలితాలు తెచ్చిన వాళ్లకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇస్తాం… సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తాం. ఎంపీ సీటు గెలిపిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా సీట్లు గెలిచే బాధ్యత నేను తీసుకుంటా… పార్టీలో ఉంటూ ఒకరిద్దరు నాయకులు పార్టీకి నష్టం చేస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. అట్లా చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే… అట్లాంటి వాళ్లను ఉపేక్షించే ప్రసక్తే లేదు. కొందరు నేతలు కావాలనే విష ప్రచారం చేస్తున్నారు. వారి సంగతి అధిష్టానం చూసుకుంటుంది. మీరంతా కలిసి కట్టుగా బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయండి. గల్లీలో, ఢిల్లీలో అధికారంలో లేని బీఆర్ఎస్ కు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లే. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

డాక్టర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ….
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలన్నారు. బండి సంజయ్ ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలున్నాయన్నారు. గ్రామాల్లోనూ బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా తేల్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. బీఆర్ఎస్ కు అభ్యర్ధి ఉన్నా ఆ పార్టీకి ఓటేయడం దండుగ అనే భావనలో ప్రజలున్నారన్నారు. పోరాటాలతో రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించి కేసీఆర్ సర్కార్ ను గద్దె దించడంలో బండి సంజయ్ చేసిన కృషి అమోఘమన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ గెలుపు అనివార్యమనే భావనలో కార్యకర్తలతోపాటు సామాన్యులు కూడా ఉన్నారన్నారు.

సీహెచ్.విఠల్ మాట్లాడుతూ….
బండి సంజయ్ ను ఈసారి కూడా ఓడించేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో కేసీఆర్ వందలు కోట్లు ఖర్చు పెట్టాడు. ప్రజల కోసం, పార్టీ కోసం నిరంతరం పనిచేసే సంజయ్ ను గెలిపించుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం మనందరిపైనా ఉంది. సంజయ్ గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలున్నాయి. కరీంనగర్ ప్రజలకు, కార్యకర్తలకు మేలు జరిగే అవకాశాలున్నాయనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *