స్వార్ధం కోసం కరీంనగర్ కు హానీ చేస్తే ఊరుకొను

ఉపాధ్యాయులారా…. మీ మౌనం సమాజానికి అరిష్టం
. పోరాడే గొంతుకకు అండగా నిలవండి
. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రశ్నించే గొంతుకను గెలిపించండి
. స్వార్ధం కోసం కరీంనగర్ కు హానీ చేస్తే ఊరుకొను
. కేజీ టు పీజీ టీచర్స్, లెక్చరర్ల ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ కుమార్

కరీంనగర్:
ఉపాధ్యాయులు, మేధావులు.. మీ మౌనం సమాజానికి నష్టం…మౌనాన్ని వీడి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్లతో ఓట్లేసి ప్రశ్నించే, పోరాడే గొంతుకకు అండగా నిలవండి’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని పద్మనాయక మండపంలో మంగళవారం జరిగిన కేజీ టు పీజీ టీచర్స్, లెక్చరర్స్ ఆత్మీయ సమ్మేళనానికి బండి సంజయ్ కుమార్ హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడి 74 కేసులు ఎదుర్కొంటున్న అని, నాతో పాటు 5 వేల మంది బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని తెలిపారు. వందల మందిపై రౌడీషీట్ ఓపెన్ చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల కోసం జీవితాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న మాలాంటి వాళ్లకు ఓట్లేసి గెలిపించకపోతే సమాాజానికి ఏ సందేశం వెళుతుందో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ, తీగలగుట్టపల్లి ఆర్వోబీ, రోడ్ల విస్తరణ, రేషన్ బియ్యంతోపాటు గ్రామాల్లో వీధి దీపాలు, రైతు వేదికలు, ప్రకృతి వనాలు సహా జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులు ఇస్తున్నదన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం రూ.9 వేల కోట్లు తీసుకొచ్చానని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని గంగులకు సవాల్ విసిరిన స్పందించలేదన్నారు. నేను అవినీతికి పాల్పడితే… నన్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎందుకు నియమిస్తుందో ఆలోచించాలన్నారు. 14 వందల మంది బలిదానాలతో తెలంగాణ వస్తే ఒక కుటంబమే రాజ్యమేలుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలు అమలు కావాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో మోసం చేస్తోందని, గెలిస్తే అమ్ముడుపోబోమనే గ్యారంటీ కాంగ్రెస్ నాయకులు ఇవ్వగలరా? అని అడిగారు.