కెసిఆర్ ఒక నకిలీ నోటు.. జేబులో పెట్టుకుంటే జైలుకే..

కెసిఆర్ ఒక నకిలీ నోటు.. జేబులో పెట్టుకుంటే జైలుకే..
. రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే..
. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చేవి
. హుజరాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే..
. అధికారంలోకి వస్తే పివి జిల్లా ఏర్పాటుకు కృషి
. నిరుద్యోగ యువకులే కథానాయకులు కావాలి
. బిజెపి, బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలి
. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ను గెలిపించాలి
. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

జమ్మికుంట:
కేసీఆర్ ఒక నకిలీ నోటని, ఆ నోటును జేబులో పెట్టుకుంటే జైలుకుపోవడం ఖాయమని అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. గురువారం నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం అన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టడానికి గత ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బల్మూరి వెంకట్ కు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నికలని అన్నారు. హుజురాబాద్ గడ్డకు ఒక ప్రతేకథ ఉందని, పోరాట యోధులు ఉన్న ప్రాంతం అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా దేశానికి నాయకత్వం వహించిందని, పీవీ నరసింహారావు ప్రధానిగా చేసిన ప్రాంతం హుజురాబాద్ అన్నారు. ఇలాంటి గడ్డపై కోవర్టులు, పార్టీ ఫిరాయింపుదారులు, వెన్నుపోటుదారుడు ఉండడం దౌర్భాగ్యం అన్నారు. ఉప ఎన్నికల సమయంలో సంపుకుంటారా… సాదుకుంటారా అంటే 20 యేళ్లు మనతో ఉన్నాడు కదా అని ఓటేస్తే గెలిచిన ఈటల పక్క చూపులు చూస్తున్నాడన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అన్నాడు…చేశాడా?అని అడిగారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించాడా… ఈ ప్రాంతానికి పరిశ్రమ లేమైన తెచ్చాడా అని ప్రశ్నించారు. గత మూడేళ్లుగా హుజరాబాద్ ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. తెలంగాణను దోచుకున్న కేసిఆర్ ను నిలదీస్తానన్న ఈటల రాజేందర్ ఏం చేశాడన్నారు. పెంచి పెద్ద చేసిన హుజూరాబాద్ ప్రజలను కాదని పక్క చూపు చూస్తున్నాడని విమర్శించారు. హుజురాబాద్ గడ్డ మేధావులకు పుట్టినిల్లని, రాచరిక పాలను అంతమొందించేందుకు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించాలన్నారు. ప్రజలు కష్టపడి కాంగ్రెస్ పార్టీకి 2018 లో 60 వేల ఓట్లు ఇస్తే, కమిషన్ కోసం, ఇసుక కాంట్రాక్టర్ల కోసం, ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీకి కౌశిక్ రెడ్డి నమ్మకద్రోహం చేశాడన్నారు. ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ పదవి పెద్దదన్నారు. ప్రణవ్ కుటుంబం గురించి ప్రజలందరికీ తెలుసని, వారు సహాయం చేసే వ్యక్తులే కానీ ఆపద కలిగించే వారు కాదన్నారు.

హుజరాబాద్ అభివృద్ధి బాద్యత నాదే..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, హుజురాబాద్ అభివృద్ధి బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రణవ్ ను గెలిపిస్తే హుజూరాబాద్ జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తాడన్నారు. ప్రజలకు అండగా నిలబడుతాడని, ప్రణవ్ తరుపున హామీ ఇస్తున్నట్లు తెలిపారు. రానున్నది ఇందిరమ్మ రాజ్యమే అన్నారు. కెసిఆర్ ఉద్దెర మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాడని, ఆయన మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమంటే చేయలేదన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో దద్దమ్మలను పెట్టి నిరుద్యోగుల జీవితాలతో కేసిఆర్, కేటీఆర్ చెలగాట మాడారని విమర్శించారు. ఈ విషయం పై స్వయంగా ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ హైకోర్టులో కేసు వేసి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నాడని తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉన్నారని, వారిని పట్టించుకోలేదన్నారు. ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ లో కనిపించే పరిస్థితినీ తీసుకువచ్చాడని ఆరోపించారు. నిరుద్యోగ విద్యార్థి యువకులే కథానాయకులై కథనరంగంలో దిగి కేసీఆర్ ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. పింఛన్ వస్తున్నదని మాట్లాడుతున్న నాయకులు, వారింట్లో ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించాలన్నారు.

ప్రజల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి..
దొరల రాజ్యం పోవాలన్న..ప్రజల రాజ్యం రావాలన్న కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హైదరాబాదులో ఆరు గ్యారెంటీ పథకాలను తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ. 2,500, రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందన్నారు. రైతు భరోసా కింద రూ.15 వేల పెట్టబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ ఇస్తామన్నారు. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. గృహ నిర్మాణానికి రూ. 5లక్షల సాయం, విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రూ.2వేలు ఉన్న పెన్షన్ రూ. 4వేల చొప్పున అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకాలను వెంటనే అమలు చేస్తుందన్నారు. బిజెపి, బీఆర్ఎస్ ఓడించాలని, మార్పు కావాలని, కాంగ్రెస్ రావాలన్నారు. లక్షల కోట్ల రూపాయలు మింగి వందల కోట్ల భూములను సంపాదించుకున్న కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మచ్చలేని కుటుంబం నుంచి వచ్చిన వోడితల ప్రణవ్ ను ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎన్ఎస్ యుఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్, పీసీసీ సభ్యులు దాసరి భూమయ్య, పత్తి కృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి అరకాల వీరేశలింగం, నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు .