నిరుద్యోగులను వంచించిన కేసీఆర్

0
  • యువత ప్రాణ త్యాగాలతోనే తెలంగాణ ఏర్పాటు
  • కేసీఆర్, కవిత ఇళ్లపై సిబిఐ ఈడి దాడులేవి
  • మహిళా సంక్షేమంలో బిఆర్ఎస్ విఫలం
  • ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలి శర్మ

హుజురాబాద్:
రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడిన నిరుద్యోగులను సీఎం కేసీఆర్ వంచించారని ఎఐసిసి అధికార ప్రతినిధి డాలి శర్మ విమర్శించారు. హుజరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. యువత ప్రాణ త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందన్నారు. వారి బలిదానాలను చూసి చలించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. ఆంధ్రాలో అధికారం దక్కదని తెలిసిన యువత ప్రాణాల కంటే ఎక్కువ కాదని భావించి రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. ఎన్నో ఆశలతో ఏర్పడిన తెలంగాణను కెసిఆర్ దగా చేశారని పేర్కొన్నారు. తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కెసిఆర్ కుటుంబ చెదలు పట్టుకుందని దుయ్యబట్టారు. నియంత పాలనలో తెలంగాణ వంచనకు గురైందన్నారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమాగా చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలను అడియాశలు చేసిందన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలు నీటి మూటలే అయ్యాయన్నారు. నల్లధనం వెలికి తీసి ప్రతి వ్యక్తి ఖాతాలో 15 లక్షలు వేస్తామని ఆశలు చూపారన్నారు. బిజెపి, బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఆమె విమర్శించారు. నిరుద్యోగుల పాలిట బిఆర్ఎస్ పాలన శాపంగా పరిణమిచ్చిందన్నారు. అప్పులు తెచ్చి కోచింగ్లు తీసుకున్న నిరుద్యోగ విద్యార్థులు అవి తీర్చే దారి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ల లీకులు, ఉద్యోగాలు అమ్ముకోవడం, నిరుద్యోగులను మోసం చేస్తూ తొమ్మిదేళ్ల పాలన సాగించారని విమర్శించారు. తెలంగాణ యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, నిరుద్యోగ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.

మహిళలకు రక్షణ కరువు..
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళల మిస్సింగ్ కేసులలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. అదృశ్యమైన మహిళలు ఎక్కడ ఉన్నారని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. మహిళలు అంటే కేవలం ఒక కవితేనా అంటూ అడిగారు. మహిళలు అదృశ్యం అవుతున్న ఎందుకు కేసు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కుటుంబం స్కామల ఫ్యామిలీగా తయారైందన్నారు. ఆయన కుటుంబంలో రోజు ఏదో ఒక స్కాం బయటపడుతుందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీఎం కేసీఆర్ కూతురు కవిత ఉన్నప్పటికీ బిజెపి ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో అనేకమంది నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్న సిబిఐ, ఈడి దాడులు కేసీఆర్, కవిత ఇళ్లపై ఎందుకు జరగట్లేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లు అబద్దాల కోరలేనని విమర్శించారు.

బీసీ అధ్యక్షుని తొలగించింది బిజెపి కాదా…
బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని చెబుతున్న ఆ పార్టీ, బీసీ అధ్యక్షుడైన బండి సంజయ్ ని తొలగించి కిషన్ రెడ్డిని నియమించింది వాస్తవం కాదా ప్రజలు గ్రహించాలన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది బీసీలకు అవకాశాలు ఇచ్చిందని ముఖ్యమంత్రిని చేసిందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్, ఎన్ఎస్ యుఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్, పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి నాయకులు సొల్లు బాబు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *