కమిషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్ట్…

0

.కెసిఆర్ నిరంకుశ పాలన అంతమొందించడమే టీజేఎస్ లక్ష్యం
. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవమే ముఖ్యం
. నిరుద్యోగుల ఉసురు పోసుకున్న కేసీఆర్..
. బిఆర్ఎస్ గెలిస్తే మనకు చిప్పగతే…
. బిఆర్ఎస్, బిజెపిని ఓడగొట్టండి..
. ప్రజలు స్వేచ్ఛగా బతికే అధికారం కావాలి…
. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్ కు మద్దతు
. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం

హుజురాబాద్:
కేవలం కమిషన్ల కోసమే సీఎం కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు కట్టాడని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. శనివారం హుజరాబాద్ పట్టణంలోని సాయి రూప గార్డెన్లో జరిగిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) హుజరాబాద్ నియోజకవర్గం స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలందరూ కలిసి కొట్లాడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. ఉద్యమ కేంద్రానికి హుజురాబాద్ కేంద్ర బిందువుగా ఉండేదన్నారు. ఉద్యమంలో అనేకమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలను మరిచిపోయాడన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని, పక్తు రాజకీయ పార్టీ అని నిస్సిగ్గుగా మాట్లాడారన్నారు. ఓట్లతో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రజలను శత్రువుగా చూశాడన్నారు. పూర్వం రోజుల్లో రాజులు సైతం మారువేషంలో వచ్చి ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే వాళ్ళని, ధర్మగంటలు రాజుల ఇంటి ముందు కట్టేటోల్లని గుర్తు చేశారు. కానీ కెసిఆర్ అధికారం చేపట్టాక ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం ఎవరికి అందుబాటులో లేదని, అంతా కేసీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. భూమండలంలో ఎవరినైనా కలువచ్చని, కానీ కేసీఆర్ ని మాత్రం కలువలేమన్నారు.

ధనార్జనే ద్యేయంగా ప్రభుత్వ పాలన..ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున తెలంగాణ సంపాదన కమిషన్ల పేరుతో దోచుకున్నదని ఆరోపించారు. కేవలం కమిషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేశారన్నారు. రూ.40 వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాలేశ్వరం ప్రాజెక్టును ఒక లక్ష 87 వేల కోట్లకు పెంచాడని మండిపడ్డారు. ఈ నిర్మాణానికి కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి ప్రభుత్వం 18 రకాల అనుమతులు ఇచ్చిందన్నారు. మోడీ అనుమతులు ఇచ్చిండు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఏమి మాట్లాడట్లేదన్నారు. కాలేశ్వరం పై ఎన్ని ఫిర్యాదులు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టడం ప్రశ్నించారు. లిక్కర్ కేసులో కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని అడిగారు. కేంద్ర ప్రభుత్వానికి అధికారమే ముఖ్యమని, ప్రజా సమస్యలపై పట్టింపు లేదన్నారు. కేవలం కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లపైనే ఐటి దాడులు ఎందుకు చేస్తున్నదని ప్రశ్నించారు.

విద్య, వైద్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం…
తెలంగాణలో విద్య వైద్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 3వేల పాఠశాలలు మూసేశారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్యం అందడం లేదన్నారు. ప్రభుత్వ విద్యను ప్రైవేటు పరం చేసి సామాన్యులకు విద్యను దూరం చేస్తున్నదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు, సరిపడా సిబ్బంది లేరన్నారు. ఊరూరికి బెల్ట్ షాప్ లు పెట్టి జనాలకు తాగుడు అలవాటు చేశారన్నారు. రాష్ట్రంలో భూ కబ్జాలు అవినీతి పెరిగిపోయిందన్నారు. ధరణి పేరుతో ప్రభుత్వం దగా చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పుల కుప్పగా చేసిన టిఆర్ఎస్ కెసిఆర్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.

ప్రశ్న పత్రాలు అమ్ముకున్న ఘనత కేసిఆర్ కుటుంబానిదే…
దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల రాత పరీక్షల ప్రశ్నాపత్రాలను అమ్ముకున్న ఘనత కేసిఆర్ కుటుంబానికి దక్కుతుందని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడన్నారు. పైసలు లేకనే ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడం లేదన్నారు. నిరుద్యోగులు ఉద్యోగ వస్తాయనే ఆశతో వేల రూపాయలు పెట్టి కోచింగ్ లు తీసుకుంటే వారి ఆశలపై కెసిఆర్ ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. సామాజికంగా ఎదగాలంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ పరీక్ష రద్దుతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ప్రవళిక కేసును మంత్రి కేటీఆర్ తప్పుదోవ పట్టించాడని ఆరోపించారు. ఆ అమ్మాయిని బద్నాం చేసి తాము గెలవాలని చూశారని, తమ కూతురైతే అలానే చేస్తారా అని ప్రశ్నించారు.

ప్రజలు స్వేచ్ఛగా బతికే అధికారం కావాలి…
రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా బతికే అధికారం రావాలన్నారు. ప్రజలు ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజాస్వామిక తెలంగాణను ప్రజలు స్వేచ్ఛగా బతికే విధంగా పాలన అందించేందుకు రాహుల్ గాంధీ ఒప్పుకున్నట్లు తెలిపారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఆరెస్ మళ్ళీ గెలిస్తే మన చేతికి చిప్పే వస్తదన్నారు. ధరణి తీసేయమని అనట్లేదని, దాని స్థానంలో మంచిది రావాలని కోరుతున్నామన్నారు. దోపిడీ ఇలానే సాగితే… నిరంకుశత్వం కొనసాగితే… ప్రజాస్వామ్యం ఏమి కావాలని ప్రశ్నించారు. పీవీ పేరుతో జిల్లాను ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. హుజూరాబాద్ కు జిల్లా అయ్యే అన్ని అవకాశాలు ఉన్నాయని, జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మార్పు కావాలని లేదంటే నష్టం జరుగుతుందన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలను ఓడగొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పివి జిల్లా ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని హుజురాబాద్ జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరామ్ కు వినతిపత్రం ఇచ్చారు. టీవీ జిల్లా ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముక్కెర రాజు, నాయకులు స్రవంతి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *