కాలేశ్వరం కెసిఆర్ కట్టిండు కాబట్టే దస్కింది: ప్రొఫెసర్ కోదండరాం

వనరుల దోపిడీకి పాల్పడుతున్న కెసిఆర్ ప్రభుత్వం..
. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో బిఆర్ఎస్ విఫలం
. యువతను శక్తిహీనులను చేస్తున్న నిరుద్యోగ సమస్య
. కాలేశ్వరం కెసిఆర్ కట్టిండు కాబట్టే దస్కింది
. ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యం.
. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణవ్ ను ఆశీర్వదించండి
. తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం

జమ్మికుంట:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్, కెసిఆర్ ప్రభుత్వం వనరుల దోపిడీకి పాల్పడుతూ సహజ వనరులను విధ్వంసం చేస్తున్నదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కేవలం కేసీఆర్ ఒక్కనితోనే రాలేదని, యావత్ తెలంగాణ ప్రజలంతా కలిసి పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నెరవేర్చిందన్నారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పై ఉందన్నారు. మిగులు రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చాడన్నారు. దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు కేవలం కాగితాలకే పరిమితమైందన్నారు.

ఉద్యోగాల భర్తీలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం…
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యం తోనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంకా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. నిరుద్యోగ సమస్య యువతను శక్తిహీనులను చేస్తున్నదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ ను ఇంజనీర్లు కాకుండా కేసీఆర్ కట్టిండు కాబట్టే దస్కీ పోయిందన్నారు. హుజురాబాద్ ను పివీ జిల్లాగా ఏర్పాటు చేయని కెసిఆర్ కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఈనెల 30 తర్వాత కెసిఆర్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. తెలంగాణలో కెసిఆర్ కుటుంబం మాత్రమే బాగుపడ్డదన్నారు. లిక్కర్ కేసులో కవితను బిజెపి ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఒకటేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటుకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు. నిరంకుశ పాలనను అంతమొందించి అసమానతలు లేని తెలంగాణ ఏర్పాటు కోసమే కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ బాబును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.