అవకాశం ఇవ్వండి ప్రతి కుటుంబానికి ఒక అన్నగా, తమ్మునిగా తోడుంటా: పాడి కౌశిక్ రెడ్డి

ఒక అవకాశం ఇవ్వండి…
. హుజురాబాద్ ని మరో సిద్ధిపేట్ లా మారుస్తా…
. అభివృద్ధి చేయకపోతే మళ్లీ ఓటు అడగను…
. వెయ్యి కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా..
. ప్రతి కుటుంబానికి ఒక అన్నగా, తమ్మునిగా తోడుంటా..
. ఆదరించి ఆశీర్వదించండి
. బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్:
ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఏ ఆపద వచ్చిన ఒక అన్నగా, తమ్మునిగా అండగా తోడుంటానని బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం హుజరాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 15 ఏళ్లుగా హుజురాబాద్ నియోజకవర్గంలోనే ప్రజల మధ్య గడుపుతున్నానని, వారికి ఏ ఆపద వచ్చినా అన్న అంటే నేనున్నా అంటూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని తెలిపారు. దండం పెట్టి అడుగుతున్న 15 సంవత్సరాల నా కష్టాన్ని గుర్తించాలని ప్రజలను వేడుకున్నారు. ఉప ఎన్నికల తరువాత 50 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. హుజురాబాద్ లో స్పోర్ట్స్ స్టేడియం తో పాటు మిని కలెక్టరేట్ నిర్మిస్తానన్నారు. అలాగే చిలుక వాగు బ్రిడ్జి, మోడల్ చేరువుని మంచి టూరిజం స్పాట్ గా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. మొన్న ప్రజా ఆశీర్వద సభలో ముఖ్యమంత్రి కూడా హుజురాబాద్ లో బిఆర్ఎస్ గెలిపిస్తే అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత నాదే అన్నారని గుర్తు చేశారు. హుజురాబాద్ లో 20వేలకు పైగా మెజార్టీ ఇస్తే హుజురాబాద్ పట్టణంలోని దత్తత తీసుకుంటానన్నారు. దీంతో పాటు హుజురాబాద్లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలను అందిస్తూ వారి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు.

ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి…
ముఖ్యమంత్రి కొత్త మేనిఫెస్టో తయారుచేసి మరోసారి పేదలకు అండగా ఉండేలా చూశారన్నారు. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచడం జరుగుతుందన్నారు. సౌభాగ్య లక్ష్మి పేరుతో అర్హులైన మహిళలందరికీ ప్రతినెల రూ.3 వేలు అందిస్తామన్నారు. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ ని కూడా కేవలం రూ.400 కి అందించనున్నామని ఆయన అన్నారు. రైతు బీమా లాగానే కెసిఆర్ ధీమా ఇంటింటికి బీమా అని ఒక పథకం ప్రవేశపెట్టారని, రేషన్ కార్డు దార్లందరికి పథకం వర్తిస్తుందన్నారు. తెలంగాణలో మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతున్నాడని, కేసీఆర్ సీఎం అయినప్పుడు హుజురాబాద్ లో ఎవరు గెలిస్తే బాగుంటుందో ఆలోచించాలన్నారు. హుజురాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకొని అయినా సరే 1000కోట్ల రూపాయలు తీసుకువచ్చి హుజురాబాద్ ని సిద్దిపేట తరహాలో తీర్చిదిద్దుతానని అన్నారు. మాటమీద నిలపడకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు కోసం మీ ముందుకు రానని అన్నారు. అక్క చెల్లెల్లారా, అన్నదమ్ముల్లారా ఒక్కసారి ఆలోచించండి మీకు దండం పెట్టి అడుగుతున్న ఒక్క అవకాశం కల్పిస్తే హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. హుజురాబాద్ లోని అన్ని వార్డులలో ఉన్న సమస్యలతో పాటు రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, మునిసిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్ లతోపాటు కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.